దుగ్గొండి: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని మధిర గ్రామానికి చెందిన మడతలపాటి ఆనంద్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఆయనకు నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ యువతను సంఘటితం చేస్తామన్నారు.
వర్ధన్నపేట: పట్టణానికి చెందిన వన్నాల రిష్మిత జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనకు ఎంపికైంది. న్యూఢిల్లీలో ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్న 12వ జాతీయస్థాయి ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలకు రిష్మిత ఎంపికవడం గర్వకారణమని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. వర్ధన్నపేటకు చెందిన వన్నాల నాగరాజు–సౌభాగ్య దంపతుల కుమార్తె రిష్మిత 2023–24 విద్యాసంవత్సరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్లో ప్రథమ స్థానం సాధించింది. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు
గీసుకొండ: మండలంలోని పలు ఆలయాలను శుక్రవారం దేవాదాయ శాఖ వరంగల్, ఖమ్మం జిల్లాల ఉప స్థపతి శివశంకర్ పరిశీలించారు. మచ్చాపూర్లోని హనుమాన్, సూర్యతండాలోని దుర్గమ్మ, ఊకల్లోని మడేలయ్య, శాయంపేటహవేలిలోని పాంచాల రాయస్వామి ఆలయాలను సందర్శించారు. ఆలయాల అభివృద్ధికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆయన పరిశీలనకు వచ్చారు. సూర్యతండా సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర, మాజీ ఎంపీటీసీ వీరారావు, మాజీ సర్పంచ్ నాగార్జున, గ్రామ పెద్దలు నరేందర్, భాస్కర్, రమేశ్, సురేశ్, నాగరాజు, కుమారస్వామి, రవి, పరమేశ్ పాల్గొన్నారు.
‘సమాన పనికి
సమాన స్టైఫండ్ ఇవ్వాలి’
నర్సంపేట రూరల్: సమాన పనికి సమాన స్టైఫండ్ ఇవ్వాలని ఎఫ్ఎంజీఈ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్న్షిప్ చేస్తున్న ఎఫ్ఎంజీఈ వైద్యులు శుక్రవారం నర్సంపేట కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎఫ్ఎంజీఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా మెరిట్ ప్రకారం నర్సంపేట వైద్య కళాశాలకు తమను కేటాయించారని పేర్కొన్నారు.
నర్సంపేట ఆస్పత్రి తనిఖీ
నర్సంపేట రూరల్ : నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనిక్ విభాగానికి చెందిన నాలుగు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఎన్ఎంసీ బృందం ప్రతినిధి డాక్టర్ ఫసిహా తస్నీమ్ అబ్దుల్ అజీజ్ శుక్రవారం జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్ బ్లాక్ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉండే సౌకర్యాలను, స్టాప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంద్యారాణి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి తదితరులు పాల్గొన్నారు.


