ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోష కాలంలో నందీశ్వరుడికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం గర్భాలయంలో రుద్రుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో శ్రీమల్లికార్జున స్వామి గర్భాలయానికి ఎదురుగా ప్రతిష్ఠితమైన నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. నందీశ్వరుడికి వస్త్రధారణ చేసి, ధూపం వేసి గంధం బొట్టుపెట్టి అలంకరించారు. వేదోక్తంగా పూజించి పండ్లు ఫలాలతో నైవేద్యం సమర్పించారు. శనిగల ప్రసాదం నందీశ్వరుడి మూతికి కట్టి, వడమాలను మెడలో వేసి సమర్పించారు. అనంతరం ఏక కాలంలో నందీశ్వరుడికి, గర్భాలయంలో రుద్రుడికి నక్షత్ర హారతి సమర్పణ కార్యక్రమం కనుల పండువగా జరిపించారు. ఆర్జిత సేవా టికెట్ భక్తులకు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ సుధాకర్, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, వేద పారాయణదారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, సాయివరుణ్, మణిశర్మ, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.


