కాళోజీ సెంటర్: ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డలోని ఎంపీపీఎస్ నిధుల దుర్వినియోగం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు లేకపోవడంతో ఆ పాఠశాల మూతపడింది. దీంతో గతంలో పనిచేసిన ఎస్జీటీ యాకయ్య పాఠశాల నిర్వహణ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ (ఎస్ఎంసీ) కమిటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, ఆ నిధులను తన భార్య (మాజీ ఎంఈఓ) బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. ఎంఈఓ, ఎంపీడీఓ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవినీతి నిజమేనని తేలుస్తూ డీఈఓ కార్యాలయానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా టీచర్ యాకయ్యను జూలైలో సస్పెండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్న సదరు ఉపాధ్యాయుడి భార్య (మాజీ ఎంఈఓ)పై చర్యలు తీసుకోవడంలో మాత్రం విద్యాశాఖ తీవ్ర కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఫైల్‌ను వెనక్కి పంపించిన ఆర్జేడీ ఆఫీస్..
ఆమైపె క్రమశిక్షణ చర్యల నిమిత్తం డీఈఓ కార్యాలయం నుంచి డీఈఓ రంగయ్యనాయుడు ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకుల (ఆర్జేడీ) కార్యాలయానికి ఫైల్ పంపించారు. నివేదిక సమగ్రంగా లేదంటూ ఆర్జేడీ కార్యాలయం ఆ ఫైల్‌ను వెనక్కి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ఎంఈఓపై వచ్చిన నిధుల దుర్వినియోగం అభియోగంపై 2026 జూన్‌లో డీఈఓకు అప్పటి ఎంపీడీఓ, ఎంఈఓ నివేదిక సమర్పించారు. నివేదిక సమగ్రంగా లేదని విద్యాశాఖ ఆర్జేడీ వెనక్కి పంపించారు. సమగ్ర రిపోర్టు ఇవ్వాలని సూచించారు. దీంతో ఖానాపురం ఎంఈఓ చరణ్‌సింగ్, నర్సంపేట ఎంఈఓ సారయ్యను విచారణ అధికారులుగా నియమించారు. వారు కూడా రిపోర్టు అందజేసి సుమారు మూడు నెలలు అవుతోంది. డీఈఓ కార్యాలయంలోనే సంబంధించిన ఫైల్ కదలకుండా ఉంది. పాఠశాల నిధులు దుర్వినియోగమయ్యాయని మాజీ ఎంఈఓ భర్త యాకయ్యను జూలై 1న సస్పెండ్ చేశారు. ఈ విషయంపై ‘భర్తపై సస్పెన్షన్ వేటు.. భార్య సంగతేంటి’? శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అప్పటి ఎంఈఓ చరణ్‌సింగ్ డైట్ కళాశాలకు బదిలీ కాగా.. నర్సంపేట ఎంఈఓ సారయ్య ఉద్యోగ విరమణ చేశాడు.
మాజీ ఎంఈఓపై విచారణ పేరుతో
కాలయాపన
జిల్లా విద్యాశాఖాధికారి
కార్యాలయంలోనే ఫైల్
సమగ్ర రిపోర్టు ఇవ్వలేదు
ఖానాపురం మాజీ ఎంఈఓపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ అధికారులను నియమించగా సమగ్ర రిపోర్టు ఇవ్వలేదని ఆర్జేడీ వెనక్కి పంపారు. తిరిగి మరో ఇద్దరు అధికారులను కూడా నియమించాం. వారు కూడా పూర్తి రిపోర్టు ఇవ్వ కుండా అన్ని జిరాక్స్ కాపీలు అందజేశారు. ఆ ఫైల్ చూడడానికి కొంత సమయం పడుతుంది.
– బి.రంగయ్యనాయుడు, డీఈఓ


