హన్మకొండ అర్బన్: జిల్లాలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు వేయిస్తంభాల గుడిలో, సద్దుల బతుకమ్మ పద్మాక్షమ్మ ఆలయంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు వెంకన్న, వెంకటేశ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, వివిధ శాఖల అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనలోగా సమస్యలన్నీ పరిష్కరించాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చేలోగా క్షేత్రస్థాయిలో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి దేవాలయ మాడవీధుల పనులను అధికారులు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భూసేకరణ విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల వల్ల ఇళ్లు, స్థలాలు కోల్పోయిన అర్హులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వారు ఖాళీ చేసిన ఇళ్లు, స్థలాల్లోకి ఇతరులు ప్రవేశించి తమకూ ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కొందరు కోర్టులకు వెళ్లి తప్పుడు నంబర్లు చూపిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలాంటివారిపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టు విషయాల్లో సీనియర్ న్యాయవాదులను నియమించుకుని ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాలని సూచించారు.
భక్తులకు అసౌకర్యం కలగొద్దు
వరంగల్ అర్బన్: సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న సూచించారు. బుధవారం హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఎఫ్ఓ శంకర్లింగం, ఎస్ఎఫ్ఓ రాజేశ్వరరావు, ఈఈలు రవికుమార్, సంజయ్కుమార్, మహేందర్, ఎంటమాలజిస్ట్ రజని పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి,
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్


