వేలేరు: అప్పుల బాధతో వేలేరు మండలం కన్నారానికి చెందిన కాశబోయిన కుమారస్వామి(32) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో ఉపాధి లేక 8 ఏళ్ల క్రితం హనుమకొండకు వలస వెళ్లాడు. గ్రామంలో ఉన్నప్పుడు వ్యవసాయ బావి తవ్వడం, మూడు, నాలుగు బోర్లు వేయడం, ఇల్లు నిర్మించుకోవడంతో దాదాపు రూ.15 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఇదిలా ఉండగా.. కుమారస్వామికి గ్రామంలో ఐదెకరాల భూమి ఉంది. కానీ ఆ భూమిలో కేవలం 15 గుంటలు మాత్రమే తన పేరుమీద పట్టా అయ్యింది. మిగతా భూమి చుట్టు పక్కల రైతుల పేరుపై ఉంది. వారి నుంచి పట్టా చేయాలని పలుమార్లు పెద్ద మనుషులు, అధికారుల చుట్టూ తిరగడంతో కొంత అప్పు అయ్యింది. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉదయం భార్య భాగ్యలక్ష్మితో గ్రామంలో పని ఉంది.. వెళ్లొస్తానని చెప్పి కన్నారం వచ్చాడు. మధ్యాహ్నం పురుగుల మందు తాగి భార్యకు ఇరుగుపొరుగు వారు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అనంతరం స్థానికులు వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పురుగుల మందు తాగి రైతు..
ఐనవోలు: అప్పుల బాధతో మండలంలోని నందనం గ్రామానికి చెందిన రైతు ఈద రాజు(43) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. తన తండ్రి గతంలో వీఆర్ఓ ఉద్యోగం చేశేవాడు. వృద్ధుడైన కారణంగా.. తండ్రి ఉద్యోగ విధులు కూడా రాజు నిర్వర్తిస్తూ ఉన్నాడు. కొంతకాలంగా సాగులో దిగుబడి రాక పెట్టుబడికి అప్పులయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. గతనెల 26న అప్పుల విషయంలో బాధపడుతూ భార్యతో గొడవ పెట్టుకుని ఆవేశంగా రాజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. పురుగుల మందు తాగినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతడు సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి భార్య ఈద జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.


