● చెన్నారావుపేట మండలంలోని లింగగిరిలో ఓ మహిళ ఎకరం పొలం కొనుగోలు చేసింది. కొత్త పట్టా పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతాను సంబంధిత ఏఈఓకు ఇచ్చారు. ఆన్‌లైన్ కూడా పూర్తయింది. అయినా పెట్టుబడి సాయం అందలేదు.
● నెక్కొండ మండలానికి చెందిన ఓ రైతుకు ఎకరం పొలం ఉంది. ప్రతీ సంవత్సరం రైతు భరోసా వస్తుంది. అయితే ఇటీవల బ్యాంకు ఖాతా మార్పు చేయించుకున్నారు. నూతనంగా ఏఈఓ వద్ద రైతు భరోసా ఆన్‌లైన్ నమోదు చేసుకున్నాడు. ఇంకా పెట్టుబడి సాయం జమ కాలేదు.
ఖిలా వరంగల్: జిల్లాలో భూమి క్రయవిక్రయాల ద్వారా కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయాన్ని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా అందిస్తామని ప్రకటించింది. దీంతో నూతనంగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆయా గ్రామాల్లోని ఏఈఓ, మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో పట్టా పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ జిరాక్సులు ఇచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో రూ.145.99 కోట్లు జమ
జిల్లాలోని 13 మండలాల పరిధిలో రైతు భరోసా పథకంలో నమోదైన 1,55,396 మంది రైతులకు ఇటీవల రూ.145.99 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం సుమారు 54 ఎకరాల వరకు ఉన్న పట్టాదారులందరికీ రూ.6వేల చొప్పున జమ చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు మార్పు చేసుకున్న రైతులకు ‘టు బీ ప్రాసెస్’ అని వస్తుంది.
కొత్త పట్టాదారుల ఎదురుచూపులు
జిల్లాలో 1,671 మంది నమోదు
ఇప్పటివరకు 1,55,396 మంది
రైతులకు రూ.145.99కోట్లు జమ
నిర్ణీత గడువు లోపే ఆన్‌లైన్
ప్రభుత్వం కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు జూలై 5వ తేదీ లోపు ఆన్‌లైన్ చేయించుకోవాలని గడువు విధించింది. జిల్లాలో 1,671 మంది రైతులు నూతనంగా పట్టాదారులుగా నమోదయ్యారు. నిబంధనల ప్రకారం ప్రకటించిన తేదీలోగా పట్టా చేసుకున్నా.. వారికి రైతు భరోసా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
త్వరలో జమవుతాయి..
జిల్లాలో నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన 1,671 మందికి రైతు భరోసా వస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు ఆన్‌లైన్ నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే నూతన రైతులకు తమ ఖాతాలోకి భరోసా నిధులు జమ అవుతాయి.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి


