నయా పోలీస్‌! | - | Sakshi
Sakshi News home page

నయా పోలీస్‌!

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

రేపు, ఎల్లుండి ఉమ్మడి వరంగల్‌ పోలీస్‌ అధికారులతో

డీజీపీ సీవీ ఆనంద్‌ సమావేశాలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : తెలంగాణ పోలీసింగ్‌లో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టే దిశగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ జిల్లాల పర్యటనలను ఉమ్మడి వరంగల్‌ నుంచే ప్రారంభిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్‌, సాంకేతికత ఆధారిత నేర నియంత్రణ, ప్రజా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై జిల్లా పోలీస్‌ అధికారులతో నేరుగా చర్చించేందుకు రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పోలీసింగ్‌ పరిస్థితి, శాంతిభద్రతలు, పెండింగ్‌ కేసులు, నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.

వరంగల్‌ నుంచే శ్రీకారం...

డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనంద్‌ ఆకస్మిక తనిఖీలు, కార్యక్రమాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించారు. జిల్లాల వారీగా సమీక్షలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను వేదికగా ఎంచుకోవడం పోలీస్‌ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలతో ఇదే తరహా సమావేశాలు నిర్వహించే కార్యక్రమానికి ఇదే నాంది కానుందని తెలుస్తోంది.

మూడు విడతల్లో సమావేశాలు..

ఈ నెల 30న వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి(వరంగల్‌, హనుమకొండ, జనగామ)లోని అధికారులతో డీజీపీ సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. 31న జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

గోప్యంగా ఏర్పాట్లు..

డీజీపీ పర్యటన షెడ్యూల్‌ను పోలీస్‌శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. సమావేశాల్లో పాల్గొనే అధికారులకు మాత్రమే అంతర్గతంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భద్రత, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పరి మిత స్థాయిలోనే చేపడుతున్నారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే పోలీసింగ్‌, ప్రజలతో ప్ర త్యక్ష అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియో గం, జవాబుదారీతనం పెంపు, సిబ్బంది సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలపై డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉందని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ప్రజలకు చేరువయ్యే పోలీసింగ్‌పై దిశానిర్దేశానికి ప్రణాళిక

వరంగల్‌ నుంచే డీజీపీ శ్రీకారం..

రికార్డులతో సిద్ధమవుతున్న అధికారులు

డీజీపీ సమీక్ష నేపథ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తోపాటు జిల్లాల వారీగా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో గత ఏడాదినుంచి నమోదైన కేసులు, వాటి పరిష్కారం, పెండింగ్‌ దర్యాప్తులు, కోర్టు విచారణలు, శిక్షలశాతం, బైండోవర్‌ కేసులు, రౌడీషీటర్ల హిస్టరీ, మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని డీజీపీ ఎదుట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement