రూ.518.40 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.518.40 కోట్లు

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

గీసుకొండ: ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల ఆర్థిక బలోపేతానికి బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–2027 కోసం రుణ లక్ష్యాన్ని అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 9,145 ఎస్‌హెచ్‌జీలు ఉండగా రూ. 518.40 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఐదేళ్ల నుంచి వందశాతం లక్ష్యం పూర్తి

బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో వందశాతం లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఎక్కువ ఎస్‌హెచ్‌జీలకు రుణాలను అందించి జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈ విషయంలో మేడ్చల్‌ మల్కాజిగిరి, పెద్దపెల్లి జిల్లాలు వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జిల్లాలో 8,226 సంఘాలకు రూ.502,83,46,000 లింకేజీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 7,242 సంఘాలకు రూ.503,14,10,000 రుణాలను ఇచ్చారు. దీంతో వంద శాతం లక్ష్యాన్ని జిల్లా అధిగమించింది. 2021 నుంచి జిల్లా లింకేజీ రుణాల పంపిణీ విషయంలో వందశాతం లక్ష్యాన్ని సాధిస్తూ వస్తుంది. దీనికి సెర్ప్‌ అధికారులు, సిబ్బంది కృషి కారణమని చెబుతున్నారు.

ఆర్థిక బలోపేతానికి..

బ్యాంకు లింకేజీ రుణాలను అందించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే లక్ష్యంగా సెర్ప్‌ ముందుకు సాగుతోంది. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు లింకేజీ రుణాలు దోహదపడతాయి. సంఘాల్లో రుణ అవసరాలు ఉన్న మహిళలను గుర్తించి సెర్ప్‌ అధికారులు, మండల సమాఖ్య నిర్వాహకులు, వీఏఓలు, సంఘాల అధ్యక్షులు, సీసీలు సంఘాల వారీగా రుణ ప్రణాళిక తయారు చేస్తారు. ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులకు కుట్టు మిషన్లు, పిండిగిర్ని, కిరాణం, బట్టల షాపు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడి సహాయం, శానిటరీ న్యాప్కిన్ల తయారీ .. ఇలా అనేక రకాల వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన రుణాలను ఇస్తారు. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణ సహాయం అందిస్తూ మహిళల జీవనోపాధికి బాటలు వేస్తారు. అలాగే ఇటీవల సోలార్‌ ప్లాంట్లు, పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

వందశాతం రుణ లక్ష్యం పూర్తి చేస్తాం..

గత ఆర్థిక సంవత్సరంలో పొదుపు సంఘాల మహిళలకు వందశాతం రుణాలు ఇచ్చి లక్ష్యాన్ని సాధించాం. ఈ ఏడాది కూడా అందరి అధికారుల సహకారంతో బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం అందించడానికి కృషి చేస్తాం.

– శంకర్‌, డీపీఎం

ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం ఖరారు

జిల్లాలో 9,145 ఎస్‌హెచ్‌జీలు

గత ఆర్థిక సంవత్సరంలో

వందశాతం పూర్తి

మండలాల వారీగా రుణ లక్ష్యం (రూ.కోట్లలో)

మండలం ఎస్‌హెచ్‌జీలు రుణ లక్ష్యం

చెన్నారావుపేట 720 39.90

దుగ్గొండి 1,016 54.40

గీసుకొండ 506 23.84

ఖానాపురం 677 38.33

నల్లబెల్లి 796 43.61

నర్సంపేట 568 40.07

నెక్కొండ 1,053 61.12

పర్వతగిరి 1,006 58.05

రాయపర్తి 1,116 70.30

సంగెం 919 49.02

వర్ధన్నపేట 768 39.71

Advertisement
 
Advertisement
Advertisement