గీసుకొండ: కొమ్మాల అంగడిలో పశువులు, జీవాల కొనుగోలు అమ్మకాల సందర్భంగా నిర్వాహకులు అధికంగా ఫీజు వసూలు చేస్తే వారి టెండర్ రద్దు చేస్తామని డీఎల్‌పీఓ వేదవతి హెచ్చరించారు. శనివారం ఎంపీఓ పాక శ్రీనివాస్‌తో కలిసి అంగడిని ఆకస్మికంగా సందర్శించారు. అంగడికి వచ్చే వ్యాపారులు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, నిర్ధేశించిన ఽఫీజులను మించి వసూలు చేయొద్దన్నారు. అంగడికి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన చోట నీడనిచ్చే పందిళ్లను ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు తదితరాలను వాడొద్దన్నారు. అంగడిలో షాపులు, హాటళ్లు, టీ పాయింట్లను నిర్వహించే వా రు ప్లాస్టిక్ కవర్లను వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగడి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు మురళి, రాజు, లావణ్య, అంగడి నిర్వాహకులు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయంతోనే అధిక లాభాలు
సంగెం: రైతులు పర్యావరణ హితమైన సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి అధిక లాభా లు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, పద్మజలు సూచించారు. శనివారం మండలంలోని కాట్రపల్లి, సంగెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరం మేరకే రసాయనిక ఎరువులు వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వరిలో కేవలం 50 కిలోల డీఏపీ, 100 కిలోల యూరియా, 25 కిలోల పోటాష్ వాడుకోవాలన్నారు. వానాకాలానికి అనువైన వరి రకాలు కునారం 1638, వరంగల్ సిద్ది, రాజేంద్రనగర్ ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకాలు, పంటల మార్పిడి గురించి వివరించారు. సాగునీటి ఆదా చేసి భావితరాలకు అందించాలన్నారు. అనంతరం పంటల సాగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్కాల శ్రావణి, ఏఓ జగదీశ్వర్, ఏ ఈఓ కార్తీక్, లావణ్య, రైతులు పాల్గొన్నారు.
పంట అవశేషాలు కాల్చొద్దు
గీసుకొండ: రైతులు వేసంగి పంటల అవశేషాలను కాల్చొద్దని, వాటిని భూమిలో కలిసిపోయేలా చేస్తే భూసారాన్ని పెంచుకోవచ్చని జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. గీసుకొండ మండలం వంచనగిరిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిధ్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రసాయన, పురుగుల మందులను మోతాదుకు మించి వాడితే నేల, నీరు, గాలి కలుషితం అవుతాయని, కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ విశ్వతేజ్, డాక్టర్ బి.సౌందర్యలు మాట్లాడుతూ వానాకాలంలో సాగులో విత్తన ఎంపికలో పొరపాట్లు చేయవద్దన్నారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌బాబు మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులను ఆధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలన్నారు. సర్పంచ్ కొమ్ముల కమల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఈఓ ఎం.కావ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్, కస్తూర్ డ్రోన్ ప్రతినిధి నరేందర్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
అంబులెన్స్‌పై విరిగిపడిన చెట్టుకొమ్మ
నర్సంపేట రూరల్: అంబులెన్స్‌పై చెట్టుకొమ్మ విరిగి పడడంతో పెను ప్రమాదం తప్పిన సంఘటన నర్సంపేట మండలంలోని లక్నెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికల కథనం ప్రకారం.. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 108 వాహనంలో వరంగల్ వైపు ఓ పేషంట్‌ను తీసుకొని వెళ్తున్నారు. వాహనం నర్సంపేట– వరంగల్ ప్రధాన రహదారి లక్నెపల్లి గ్రామశివారులోకి రాగానే భారీ వృక్షానికి సంబంధించిన చెట్టుకొమ్మ ఒక్కసారిగా విరిగి అంబు లె న్స్‌పై పడింది. దీంతో అంబులెన్స్ ఒకవైపు ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పెను ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో 108 వాహనాన్ని రప్పించి వారిని ఎంజీఎంకు తరలించారు.


