నర్సంపేట: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, ఏఐ భవిష్యత్ ప్రపంచాన్ని మలిచే శక్తిగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని ప్రిన్సిపాల్ మల్లం నవీన్ సూచించారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాల సందర్భంగా శనివారం కృత్రి మ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ వి.పూర్ణచందర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ దివ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించగా కృత్రిమ మేధస్సు అవగాహన ఆవిష్కరణ అనే అంశంపై ప్రిన్సిపాల్ నవీన్ మాట్లాడుతూ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై యువత అవగాహన పెంపొదించుకోవాలన్నారు. ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదని, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు మార్గదర్శకమన్నారు. హనుమకొండ పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ఆధునిక విద్యా వ్యవస్థలో ఏఐ యొక్క ప్రాధాన్యత, బోధన–అభ్యాసన ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిలో ఏఐ పాత్రను వివరించారు. ఏఐ వినియోగంలో జాగ్రత్తలు, డేటా భద్రత, మానవ విలువల పరిరక్షణ, విద్యార్థుల సృజనాత్మకత తగ్గిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి.సత్యనారాయణ, అకడమిక్ కో ఆర్డినేటర్ కందాల సత్యనారాయణ, ప్రజా పాలన సమన్వయకర్త ఎస్.కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


