ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 కింద చేపట్టనున్న మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులో పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు ప్రాధాన్యం లభించింది. ఈ ఐదు పట్టణాల్లో మొత్తం ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 22.80 ఎంఎల్‌డీలుగా ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి డా.టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా..

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం) 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 101 పురపాలక సంఘాల్లో మురుగునీటి నిర్వహణ పనులకు రూ.3,705.75 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో వరంగల్‌ విభాగానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పట్టణ పారిశుద్ధ్యానికి ఊరటనిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వరంగల్‌ విభాగంలో మొత్తం 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు) ఏర్పాటు చేయనున్నారు.

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌..

భూసేకరణకు ప్రత్యేక నిధులు

పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనుంది. ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) పద్ధతిలో అమలు చేయనున్నా రు. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 50 శాతానికి పైగా వ్యయాన్ని చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనుంది. నిర్మాణంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే ఉంటుంది. భూసేకరణ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మురుగునీరు నేరుగా కాలువలు, చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణాల్లో చెరువులు, వాగులు, భూగర్భజలాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు.

‘గ్రేటర్‌’లో ఉన్నా లేనట్లే..

తాజాగా ప్రతిపాదనలు

ఇక గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఇప్పటికే స్మార్ట్‌సిటీ నిధులతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్‌డీ, బంధంచెరువు వద్ద 15 ఎంఎల్‌డీ, ఉర్సుగుట్ట వద్ద 15 ఎంఎల్‌డీల సామర్థ్యంతో మూడు ఎస్‌టీపీల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాకపోగా, వచ్చినవి ట్రైసిటీలో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు సరిపోవడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2057 విజన్‌కు అనుగుణంగా అదనపు ఎస్‌టీపీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.5,257 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఐదు మున్సిపాలిటీల్లో ఆరు ఎస్‌టీపీలు.. తీరనున్న కాలుష్య బాధలు

పరకాల నుంచి నర్సంపేట వరకు గ్రీన్‌సిగ్నల్‌

22.80 ఎంఎల్‌డీ సామర్థ్యం

మూడు ప్యాకేజీలలో టెండర్లు..

పూర్తి చేసేందుకు 24 నెలల

గడువు

రూ.3,705 కోట్ల ప్రాజెక్టులో

వరంగల్‌కు ప్రాధాన్యం

Advertisement
 
Advertisement
Advertisement