రైతులపై ఎరువుల పిడుగు | - | Sakshi
Sakshi News home page

రైతులపై ఎరువుల పిడుగు

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

నర్సంపేట: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మార్కెట్‌లో పంటల ఉత్పత్తులను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులపై పెరిగిన ధరలతో ఎరువుల భారం పడనుంది. ఇప్పటికే ఎరువుల కంపెనీలు డీలర్లకు పెరిగిన ధరలపై సమాచారం అందించారు. గతంతో పోలిస్తే ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.350 వరకు ధరలు పెరుగుతాయనే అంచనాలతో ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇరాన్‌, అమెరికా యుద్ధం ప్రభావం కారణంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో పాటు ఎరువులు తరలించే నౌకల బీమా ప్రీమియం, ఇతరత్రా ధరలు భారీగా పెరగడం ప్రధాన కారణంగా వ్యాపారులు పేర్కొంటున్నారు.

రైతులపై ఆర్థికభారం

వరంగల్‌ జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో 2లక్షల 75వేల 500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా. అందుకోసం లక్షా 7వేల 500మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసే రైతులు పెరుగుతున్న ధరల సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, ధాన్యం పేరుకుపోవడం, మద్దతు ధరకు విక్రయించినప్పటికీ డబ్బులు ఇంకా అందకపోవడంతో వచ్చే వర్షాకాలంలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా వినియోగించే ఎరువుల ధరలనే అధికంగా పెంచారని, రానున్న వర్షాకాలంలో పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులపై భారం పడకుండా చూడాలి

ఎరువుల ధరలు పెరుగుతున్నట్లు షాపు డీలర్లు వెల్లడించడంతో ఆందోళనలో ఉన్నాం. పశ్చిమాసియాలో యుద్ధాల వల్ల ఎరువుల ధరలు పెరిగినట్లు డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలను అమలు చేస్తున్నారు. రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులను ఆదుకోవాలి.

– వేముల సంపత్‌ రెడ్డి, రైతు, కన్నారావుపేట

ధరల పెరుగుదలతో వానాకాలంలో తిప్పలు

ఆందోళనలో కర్షకులు

ఒకవేళ ఎరువుల ధరలు పెరిగితే..

ఎరువు రకం పాత ధర కొత్త ధర

16 – 20 – 013 1,400 1,750

20 – 20 – 013 1,500 1,800

15 – 15 – 15 – 09 1,650 1,950

14 – 35 – 14 2,150 2,350

10 – 26 – 26 1,950 2,025

సింగిల్‌ సూపర్‌ పాస్పెట్‌ 615 775

పొటాష్‌ (ఎంఓపీ) 1,850 1,975

16 – 16 – 16 1,675 2,050

12 – 32 – 16 1,850 1,950

24 – 24 – 0 2,000 2,200

Advertisement
 
Advertisement
Advertisement