మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ)నిర్మించనున్న అదనపు తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ రవి, డీఈఓ గిరిరాజ్ రావు, అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే విస్తరణ, అభివృద్ధిలో భాగంగా లెవల్ క్రాసింగ్ లైన్‌ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జి, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సీ08 బావుపేట–సీతంపేట గ్రామాల మధ్య లెవెల్ క్రాసింగ్ కి.మీ 352/8–10 హసన్‌పర్తి–ఉప్పల్ స్టేషన్ల మధ్య ఎల్కతుర్తి మండలం బావుపేటలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశారు. రెండు గ్రామాల పెద్దలు, రైతులకు అలైన్‌మెంట్ గురించి అధికారులు వివరించారు.కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సామ్రాట్ రాయ్, రోడ్ సెక్టార్ ప్రాజెక్టు రైల్వే భూ సేకరణ నిపుణుడు పి.దేవరాజు, ఆర్డీఓ రమేష్ రాథోడ్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మక్కల కొనుగోల్లు సజావుగా జరిగేలా చూడాలని, రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. డీఆర్‌డీఓ మేన శ్రీను, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వాజిద్ అలీ, డీసీఓ సంజీవరెడ్డి, డీసీసీసీఈఓ వజీర్ సుల్తాన్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.


