ఖిలా వరంగల్: జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. ప్రస్తుతం యాసంగి వరి కోతలు, ధాన్యం విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుండటంతో వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగు పనులు మొదలుకానున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాలో వరి ప్రధాన పంటగా సాగు కానుండగా, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పప్పు దినుసులు, చిరుధాన్యాల సాగు చేపట్టనున్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువుల వినియోగం తదితర అంశాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
సన్నరకాల సాగుకు ప్రాధాన్యం..
రైతులు సన్న రకాల వరి సాగు ప్రాధాన్యం ఇవ్వాలని, వివిధ పంటలకు విత్తనాలను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో జిల్లాలో సాగు ప్రణాళిక ఖరారు చేసింది. జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలు, బోర్లు, బావులు, చెరువులు, కుంటలు నమ్ముకొని పంటలు వేస్తారని అధికారులు నివేదించారు.
2,75,500 ఎకరాల్లో సాగు అవకాశం..
జిల్లాలో గతేడాది ఖరీఫ్ 2,95,300 ఎకరాల్లో వరితోపాటు వివిధ పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 2,75,500 ఎకరాలు వరితోపాటు ఇతర పంటలు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది కంటే ఈ ఏడాది 20 ఎకరాల వరకు తగ్గనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2,75,500 ఎకరాలకు 1,07,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం, ఇందు కోసం ఇప్పటి నుంచి సెప్టెంబర్ వరకు నెల వారీ కోటా ఈ మేరకు తెప్పించనున్నారు.
విత్తన రకాలు
వరి రకాలు: ఆర్‌ఎన్‌ఆర్ 15048, ఆర్‌ఎన్‌ఆర్ 10754, ఆర్‌ఎన్‌ఆర్ 28361, ఆర్‌ఎన్‌ఆర్ 29325, కెఎన్‌ఎం 1638, కెఎన్‌ఎం 118, డబ్ల్యూజీఎల్ 44, భద్రకాళి(డబ్ల్యూజీఎల్3962) బీపీటీ 52034, ఎంటీయూ 1010, అమన గోల్డ్, సూపర్ అమన, అంకూర్‌సోనా, చిట్టి పొట్టి రకాలు ఉన్నాయి.
పత్తి : యూఎస్ 7067, యూఎస్ 704, సాంకేత్, స్వీఫ్ట్, రణధీర్, చంద్రగోల్డ్, సదానంద, సీసీహెచ్ 369, నవనీత్, రాణ.
మిర్చి: యూఎస్ 341, షార్క్ 1, యశశ్విని, హెచ్‌పీహెచ్ 5531, అగ్నివన్, తేజశ్విని మైకో 641, ప్రాహార్ 121.
మొక్కజొన్న: డీకేసీ 6217, డీకేసీ 8171, 4422, ఎన్‌కె–30, ఎస్ 6668, ఎంఎం 9445, పీఏసీ 741, ఎంఆర్‌ఎం 4065 రకాలను సాగుకు ఎన్నుకోవాలని గ్రామాల వారీగా ఏఈఓ అధికారులు నిర్ధేశించారు.
అన్నదాతలకు అండగా..
రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం, రుణమాఫీ అమలు పూర్తి చేయడంతో పాటు పంటల బీమా, యంత్ర లక్ష్మి పథకాలను అమలు చేయడం ద్వారా రైతన్నలకు అండగా నిలవాల్సి ఉంది. వానాకాలం రైతుభరోసా నిధులను సకాలంలో అందించడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు పంట రుణాలు మంజూరు చేయడం, పంట రుణాలపై పావలా వడ్డీని వర్తింపజేస్తే రైతులకు మేలు చేకూరనుంది.
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
రానున్న ఖరీఫ్‌లో ఆరుతడి పంటలు, సన్న గింజ వరి రకాలను సాగు చేయాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకు విత్తన షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీల నిరోధానికి పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందాలతో సోదాలు చేపడుతాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించడంతో పాటు బిల్లు వెంటనే ఇవ్వాలి.
– అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో 2,75,500 ఎకరాల్లో
పంటల సాగు అంచనా
కావాల్సిన విత్తనాలు 36,740
క్వింటాళ్లు, పత్తి ప్యాకెట్లు 3,62,100
ఎరువులు 1,07,500 మెట్రిక్‌టన్నులు
పంట గతేడాది ఖరీఫ్
సాగు సాగు అంచనా
వరి 1,39,997 1,25,000
మొక్కజొన్న 10,307 8,000
పత్తి 1,23,176 1,10,200
పప్పులు 676 2,000
పసుపు 833 900
మిరప 2,100 8,000
కూరగాయలు 1,440 2,500
పండ్లు 6,662 7,150
ఆయిల్‌పామ్ 6,980 7,800
పూల పంటలు 280 300
ఇతర పంటలు 2,500 2,750
మొత్తం 2,95,300 2,75,500
వరి 33,750
మొక్కజొన్న 1,200
పసుపు 1,530
పత్తి (ప్యాకెట్లు) 3,62,100
పప్పులు 52 కేజీలు
మిర్చి 13.50 కేజీలు
ఇతర పంటలు 195 కేజీలు
కావాల్సిన ఎరువులు మెట్రిక్ టన్నుల్లో
యూరియా 41,000
డీఏపీ 17,500
ఎంఓపీ 14,500
ఎస్‌ఎస్‌పీ 6,500
కాంప్లెక్స్ ఎరువులు 28,000
మొత్తం 1,07,500


