భక్తుల ఇంటికే సీతారాముల తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

భక్తుల ఇంటికే సీతారాముల తలంబ్రాలు

Mar 17 2026 8:52 AM | Updated on Mar 17 2026 8:52 AM

నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో లాజిస్టిక్స్‌ ద్వారా భక్తుల ఇంటి వద్దకే భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్‌ ప్రసూనలక్ష్మి తెలిపారు. ఈ మేరకు డిపో కార్యాలయంలో సోమవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ భక్తులు తలంబ్రాలు బుకింగ్‌ కోసం నర్సంపేట బస్టాండ్‌లోని కార్గో, లాజిస్టిక్స్‌ ఆఫీస్‌లో కార్గో డిపో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ సతీష్‌, కార్గో ఏజెంట్‌ వద్ద రూ.151 చెల్లించి రశీదు పొందాలన్నారు. భద్రాచలంలోని సీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. తలంబ్రాలు బుకింగ్‌ కోసం 9704644543, 9989038476 నంబర్‌లో కూడా సంప్రదించవచ్చన్నారు.

నేడు జాతీయ సెమినార్‌

నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు (మంగళవారం) నిర్వహించనున్న రీసెంట్‌ అడ్వాన్స్‌ ఇన్‌ఫ్లాంట్‌ సైన్స్‌–ఇష్యూస్‌ అండ్‌ చాలెంజ్స్‌ ఇన్‌ క్రాప్‌ ఇంప్రుమెంట్‌ అనే అంశంపై జాతీయ సెమినార్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లం నవీన్‌ తెలిపారు. ఈ మేరకు సెమినార్‌ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. సెమినార్‌ నిర్వహణకు రూసా స్పాన్సర్‌షిప్‌ అందించడం విశేషమన్నారు. జాతీయ సెమినార్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని సెమినార్‌ నిర్వహణ కార్యదర్శి రాంబాబు తెలిపారు.

హజ్‌ యాత్రికులకు వైద్యశిబిరం

న్యూశాయంపేట: మక్కా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు ఈనెల 17, 18వ తేదీల్లో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అంజుమనే హుజాజ్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అనీస్‌సిద్దీఖీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న హనుమకొండ జిల్లా వాసులు, 18న వరంగల్‌ జిల్లా వాసులకు ఉదయం 9 గంటల నుంచి శిబిరం ప్రారంభమవుతుందన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్‌లో శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్రికులు తమ వెంట పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్డు, హజ్‌కమిటీ అందజేసిన కవరింగ్‌ లెటర్‌ నంబర్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు.

రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

దుగ్గొండి: రైతులు ఉద్యాన పంటల సాగులో ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పంటలకు డ్రిప్పు పద్ధతిలో సాగునీరు అందిస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు. కూరగాయల తోటలు, పండ్ల తోటలు, ఆయిల్‌ పామ్‌ తోటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త రాములు, డివిజన్‌ ఉద్యానశా ఖ అధికారి జ్యోతి, మండల వ్యవసాయ అధి కారి శ్యామ్‌, ఏఈఓలు హన్మంతు, రాజేష్‌, విజయ్‌నాయక్‌, త్రివేణి పాల్గొన్నారు.

ఎంజీఎంలో సమస్యలు పరిష్కరిస్తా

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్‌ చంద్రారెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈమేరకు పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యానియన్‌ – 3194 (ఐఎన్‌టీయూసీ అనుబంధ) ఎంజీఎం బ్రాంచ్‌ కమిటీ అధ్యక్షురాలు శాంతికుమారి అధ్యక్షతన ఉద్యోగులు ఎంజీఎం సూపరింటెండెంట్‌ను సోమవారం కలిశారు. ఎంజీఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement