ప్రజావాణిలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద, పక్కన వివిధ శాఖల జిల్లా అధికారులు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● ప్రజావాణిలో 136 అర్జీలు
న్యూశాయంపేట: అక్రమ పట్టా రద్దు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని, లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారదకు బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. వినతి పత్రాలను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో దరఖాస్తుదారుల సమక్షంలోనే చర్చించి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. వినతులను ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 136 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూకు సంబంధించి 60, జీడబ్ల్యూఎంసీ 15, ఇతర శాఖలకు చెందినవి 61 దరఖాస్తులు వచ్చాయి. అయితే రెవెన్యూకు సంబంధించి దరఖాస్తులు అధికంగా వచ్చిన నేపద్యంలో వాటిని సంబంధిత తహసీల్దార్‌లకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ఎండ తీవ్రత దృష్ట్యా కలెక్టరేట్ ఆవరణలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఓఆర్‌ఎస్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ, శ్రీవాణి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొన్ని దరఖాస్తులు ఇలా..
● కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను తక్షణమే వె నక్కి తీసుకోవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు విన్నవించారు.
● ఖానాపురం మండల పరిధిలోని ధర్మారావుపేట, ఖానాపురం చిలకమ్మనగర్, కొడ్తిమాట్ తండా, నాజీతండా, భద్రుతండా, మంగళవారిపేట అయోధ్యనగర్, మనుబోతులగడ్డ గ్రామాల్లో ఈ ఆర్థిక సంవత్సరం పనిదినాలకు ఉపాధి కూలీలకు చెల్లింపులు జరిగాయి. గ్రామాలకు రావాల్సిన నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు వినతిపత్రం అందించారు.
● గృహ నిర్మాణ పథకం కింద ‘డబుల్’ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వరంగల్‌కు చెందిన పి. రాధిక విజ్ఞప్తి చేశారు.
అక్రమ పట్టా రద్దు చేయాలి
ఖిలావరంగల్ మండల పరిధి సర్వే నంబర్ 243బై1 భూమికి సంబంధించిన నిజమైన పట్టాదారు ఇ.నర్సయ్య. ఇటీవల ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా పేరొకరి పేరుతో పట్టా జారీ చేసినట్లు అనుమానం ఉంది. తగిన విచారణ చేసి అక్రమ పట్టాను రద్దు చేయాలి.
– ఇనుముల సాంబయ్య, ఖిలావరంగల్
అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు..
80 సంవత్సరాలుగా వంశపారపర్యంగా వస్తున్న భూమిలో వ్యవసాయం చేస్తున్న. అందులో కొంతభాగం 6 గుంటల్లో రెండు గృహాలు నిర్మించుకున్న. దీనికి నర్సంపేట మున్సిపల్ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్న. దీంతో ఒక గృహానికి ఇటీవల పర్మిషన్ రిజెక్ట్ అని మున్సిపల్ కమిషనర్ లెటర్ పంపించారు. మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలి.
– ఎం.ఐలయ్య, ధనలక్ష్మి దంపతులు,
మహేశ్వరం


