కాశిబుగ్గ: వరంగల్‌లోని సీకేఎం (చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్)ను అక్కడి సిబ్బంది కమర్షియల్‌గా మార్చేస్తున్నారు. పేద రోగులకు ఉచితంగా అందించాల్సిన సర్కార్ వైద్య సేవలకు బేరమాడుతున్నారు. పర్యవేక్షఽణాధికారితో పాటు ఆరుగురు ఆర్‌ఎంఓలు ఉన్నప్పటికీ.. వైద్యం కోసం వచ్చే వారి నుంచి వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్లినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు గంటల తరబడి వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైరవీలతో, నగదు ముట్టజెప్పిన వారు నేరుగా వైద్య సేవలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక పాలనా విభాగంలో సైతం కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు..
సీకేఎం ఆస్పత్రిలో ఓపీ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. వీరిని క్రమపద్ధతిలో పంపించే ఏర్పాట్లు లేవు. ఎవరైనా చికిత్స కోసం త్వరగా ఓపీ వైద్యుడిని కలవాలనుకుంటే అక్కడి సిబ్బందికి డబ్బులు ముట్టజెబితే లోపలికి పంపిస్తారని ఇతర పేషెంట్లు చెబుతున్నారు.
ధ్రువీకరణ పత్రాల కోసం కూడా...
చికిత్సలు, డెలివరీతో పాటు ధ్రువీకరణ పత్రాల కో సం వచ్చినప్పుడు ఎంతో కొంతో ముట్టజెప్పాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. గైనిక్ ఆరోగ్యశ్రీ డిపార్ట్‌మెంట్ నుంచి లేబర్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు కోసం రూ.500 నుంచి రూ.1000 ఇవ్వక తప్పదు. ఇక మెయిన్ గేట్ వద్ద ఉన్న కుటుంబ సభ్యులు తమ పేషెంట్‌కు అవసరమైన పనులు చేసి పెడితే సెక్యూరిటీ గార్డులకు రూ.100 నుంచి రూ.200, అలాగే పాలన విభాగంలో ఓ ఉద్యోగి డెలివరీ సర్టిఫికెట్ కోసం రూ.1,000 నుంచి రూ.2,000లు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు.
వసూళ్ల దందాను అరికట్టాలి
ఉచితంగా వైద్యం అందుతుందని సర్కార్ దవాఖానకు వస్తే ప్రైవేట్ మాదిరిగానే ఇక్కడ వసూలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీదానికి డబ్బులివ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి డబ్బుల వసూళ్ల దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు..
పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ మురళి, ఆస్పత్రి ఆర్‌ఎంఓ
సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందా..
అడుగడుగునా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది
ఆరుగురు ఆర్‌ఎంఓలున్నా నియంత్రణ కరువు
ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
ప్రతీ పనికో రేటు..
అడ్మిషన్ తర్వాత వార్డుల్లో క్లీనింగ్ కోసం రూ.50 నుంచి రూ.100, కుట్లు విప్పడానికి రూ.50 నుంచి రూ.100, వార్డు నుంచి వార్డుకు, స్కానింగ్ కోసం వీల్ చైర్‌లో వెళ్లినప్పుడు రూ.100 నుంచి రూ.200 స్కాన్ అండ్ ఎక్స్‌రేకు రూ.200 వసూలు చేస్తున్నారు. ఇక డిశ్చార్జ్ టైంలో డిశ్చార్జ్ సమ్మరీతో పాటు మెడిసిన్ కోసం రూ.100 నుంచి రూ.200లు, లేబర్ రూంలో రూ.200, ఆపరేషన్ రూంలో పుట్టిన బిడ్డలకు రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డిశ్చార్జ్ చేసినప్పుడు సిబ్బంది రూ.200 నుంచి 500 తీసుకుంటున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.


