టికెట్‌ కోసం పైరవీలు | - | Sakshi
Sakshi News home page

టికెట్‌ కోసం పైరవీలు

Jan 18 2026 6:48 AM | Updated on Jan 18 2026 6:48 AM

టికెట

టికెట్‌ కోసం పైరవీలు

సాక్షి, వరంగల్‌: జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో వార్డులతో పాటు చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే రిజర్వేషన్లపై ఓ అంచనాతో ఉన్న అభ్యర్థులు.. ఇప్పుడు అధికారికంగా ఖరారు కావడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.

తెరవెనుక మంత్రాంగాలు

గతంలో వర్ధన్నపేట చైర్‌పర్సన్‌ ఎస్టీ మహిళ, నర్సంపేటకు బీసీ మహిళకు రిజర్వేషన్‌ ఉండగా, ఈసారి నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు, వర్ధన్నపేట చైర్మన్‌ పదవి జనరల్‌కు కేటాయించడంతో ఆ స్థానాలపై కన్నేసిన అభ్యర్థులు తమ పార్టీల నుంచి టికెట్‌ తెచ్చుకొని కౌన్సిలర్‌గా గెలవడం, ఆ తర్వాత చైర్మన్‌ పదవి దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. అదే సమయంలో తమకు పోటీగా ఉన్నారని భావిస్తున్న వారి గెలుపునకు కూడా అడ్డంకులు సృష్టించి పెద్ద పదవిని చేజిక్కించుకునేందుకు తెరవెనుక మంత్రాంగాలు అన్ని పార్టీల్లో మొదలయ్యాయి. చైర్మన్‌ పదవి కావాలనుకునే ముఖ్యులెవరైన ఉంటే వారికి పార్టీలో టికెట్‌ రాకుండా చేయడం, ఒకవేళ వస్తే అక్కడ రెబల్‌ అభ్యర్థులను బరిలోదింపి ఓడేలా చేసి తమ కలల పదవికి దక్కించుకోవాలని చాలామంది ఆరాటపడుతుండడంతో ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం కనబడుతోంది.

పాగా వేయాలని పార్టీల ఆరాటం

ఇటు నర్సంపేట, అటు వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌ పట్టుదలతో ఉండగా, గతంలో తాము గెలిచిన ఈ రెండు సీట్లను ఈసారి కూడా నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. బీజేపీ కూడా పోటీలో ఉండేలా ఇప్పటికే ప్రణాళిక రచించడంతో హోరాహోరీ పోరు ఉండనుంది. నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులు, వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు అధికారికంగా రిజర్వేషన్లు కేటాయించారు. 2011 జనగణన లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలు, డెడికేషన్‌ కమిటీ రిపోర్టు ప్రకారం బీసీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో కేటాయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద.. మున్సిపల్‌ ఎన్నికల వార్డులకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించారు. కలెక్టర్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్‌ కమిషనర్లు సుధీర్‌ కుమార్‌, భాస్కర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో ఇన్ని రోజులు తమ వార్డుకు ఏ రిజర్వేషన్‌ వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూసిన అభ్యర్థులు.. రిజర్వేషన్‌ ఖరారు కావడంతో తమ పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకునేందుకు పైరవీలు మొదలెట్టారు.

అధికారికంగా వార్డులు,

చైర్మన్ల పదవుల రిజర్వేషన్లు ఖరారు

ముఖ్యులతో మాటామంతీ,

రాజకీయ ఎత్తుగడలు

నర్సంపేట, వర్ధన్నపేటలో

మొదలైన ఆశావహుల సందడి

కౌన్సిలర్‌, ఆపై చైర్మన్‌ పదవులపై గురి

రిజర్వేషన్‌ నర్సంపేట వర్ధన్నపేట

మున్సిపాలిటీ వార్డులు మున్సిపాలిటీ వార్డులు

ఎస్టీ జనరల్‌ 13, 16 7,8

ఎస్టీ మహిళ 12 2

ఎస్సీ జనరల్‌ 22, 30 1

ఎస్సీ మహిళ 5, 23 12

బీసీ జనరల్‌ 3, 24, 19 , 29 11

బీసీ మహిళ 8, 25 , 27, 28 0

జనరల్‌ 4, 6, 7, 10, 15, 17, 21 3, 6

జనరల్‌ మహిళ 1, 2, 9, 11, 14, 18, 20, 26 4, 5, 9, 10

జనాభా ప్రాతిపదికన కేటాయించని రిజర్వేషన్లు

వర్ధన్నపేట డీసీ తండా పరిధిలోకి వచ్చే నాలుగు, ఐదు, ఆరు వార్డుల్లో ఎస్టీ జనాభానే ఎక్కువగా ఉంటుంది. ఈ వార్డులు జనరల్‌, జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఎస్టీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇవి మూడు జనరల్‌, జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఈ స్థానాలు జనరల్‌ కేటగిరిలో లెక్కించే అవకాశముంది. అయితే ఎస్సీలు, వడ్డెరవాసులు ఎక్కువగా ఉండే ఏడో వార్డు ఎస్టీ జనరల్‌కు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రెండో వార్డు ఎస్టీ మహిళకు, ఎస్సీలు ఎక్కువగా మూడో వార్డు జనరల్‌కు, ఓసీ కుటుంబాలు ఎక్కువగా ఉండే ఎనిమిదో వార్డు ఎస్టీ జనరల్‌కు, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండే పదో వార్డు జనరల్‌కు కేటాయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బీసీ మహిళ రిజర్వేషన్‌ ఒక్కటి కూడా రాలేదు. జనాభా ప్రాతిపదికన కులాల వారీగా ఓట్లను లెక్కలోకి తీసుకొని ఆయా వార్డుల్లో రిజర్వేషన్‌ ఉంటే బాగుండేందని ఓటర్లు అంటున్నారు. అలాగే, నర్సంపేట మున్సిపాలిటీలో గతంలో 24 వార్డులుంటే, ఇప్పుడు మరో ఆరు గ్రామాల విలీనంతో 30 వార్డులకు చేరుకున్న దాని ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఇక్కడా కూడా కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నవారికి కాకుండా ఇతరులకు రిజర్వేషన్లు వచ్చాయన్న చర్చ ఉంది.

టికెట్‌ కోసం పైరవీలు1
1/1

టికెట్‌ కోసం పైరవీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement