వర్ధన్నపేట అభివృద్ధిలో నా మార్క్ చూపిస్తా..
● ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
వర్ధన్నపేట: వర్ధన్నపేటలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని, తాను పోలీస్ అధికారిగా ఎలాంటి మార్క్ తెచ్చుకున్నానో ప్రజా సేవలో అలాంటి ప్రత్యేకత చాటుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. పట్టణంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు విషయంపై ఆయన శనివారం మాట్లాడారు. వర్ధన్నపేటలో తగినంత స్థలం లేదన్న కారణంతోనే ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆస్పత్రి ఏర్పాటు కోసం భూమిపూజ చేసినట్లు తెలిపారు. పట్టణవాసుల ఆకాంక్ష మేరకు వర్ధన్నపేటలోనే వంద పడకల ఆస్పత్రి కోసం దేవాదాయశాఖ భూమి కావాలని అడగగా, మంత్రి కొండా సురేఖకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
తొలగిన అనిశ్చితి
వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుపై దాదాపుగా అనిశ్చితి తొలగిపోయింది. టీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు అయూబ్ చొరవ తీసుకుని వంద పడకల ఆస్పత్రి సాధన సమితి సభ్యులను కలిసి మాట్లాడారు. ఈనెల 20న దేవాదాయ శాఖ భూమిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యేతో భూమిపూజ చేస్తామని ప్రకటించారు.
వర్ధన్నపేటలో బంద్ సంపూర్ణం
వంద పడకల ఆస్పత్రి సాధన సమితి పిలుపు మేరకు వర్తక, వాణిజ్య వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా శనివారం నిర్వహించిన బంద్‌లో పాల్గొని జయప్రదం చేశారు.
20వ తేదీ వరకు వేచి చూస్తాం..
ఎమ్మెల్యే నాగరాజు హామీ మేరకు ఈనెల 20వ తేదీ వరకు వేచి చూస్తామని వంద పడకల ఆస్పత్రి సాధన సమితి సభ్యులు తెలిపారు. తాత్కాలికంగా ఉద్యమాన్ని నిలిపి వేస్తున్నామన్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు చేపట్టిన ఉద్యమానికి వ్యాపార వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలిచి వర్ధన్నపేట బంద్‌ను సంపూర్ణం చేసి జయప్రదం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.


