ఇంటర్ అనుబంధ పరీక్షల సామగ్రి పంపిణీ
కాళోజీ సెంటర్: ఈనెల 21 నుంచి నిర్వహించనున్న ఇంటర్ అనుబంధ పరీక్షల సామగ్రిని ఈనెల 19వ తేదీలోపు అన్ని యాజమాన్య కళాశాలలు తీసుకెళ్లాలని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ సూచించారు. ఈ మేరకు ఆయా కళాశాలల సిబ్బందికి పరీక్షల సామగ్రిని శనివారం పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 66 కళాశాలల్లో ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,386 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 839 మంది విద్యార్థులు విద్యాబోధన కొనసాగిస్తున్నారని చెప్పారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 4,977, ఒకేషనల్ కోర్సుల్లో 855 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. బోర్డు ఆదేశాల మేరకు 21న ప్రథమ సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సరం ఆంగ్లం ప్రాక్టికల్స్ ఉంటాయని, 23న నైతిక, మానవ విలువలు, 24న పర్యావరణ పరీక్షలు ఉంటాయని, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన అన్ని కళాశాలలు ఈ పరీక్షలు నిర్వహించాలని శ్రీధర్ సుమన్ సూచించారు.
‘ట్రంప్, మోదీ వినాశకులు’
దుగ్గొండి: నియంతలుగా వ్యవహరిస్తూ ప్రపంచాన్ని ట్రంప్, భారతదేశాన్ని మోదీ నాశనం చేస్తున్నారని రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన కార్మిక, కర్షక పోరుయాత్ర సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారం చేపట్టి నాటి నుంచి రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువస్తూ ప్రధాని మోదీ.. నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కోట్లాది మంది పేదల కడుపునింపుతున్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కుట్ర పూరితంగా వీబీజీరామ్‌జీ చట్టంగా మార్చడం సరికాదన్నారు. ప్రపంచ దేశాలను తన అదుపాజ్ఞలో పెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం, లేబర్‌కోడ్‌లు, వీబీజీరామ్‌జీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19వరకు సాగనున్న కార్మిక, కర్షక పోరుయాత్రను రంగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈసంపల్లి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య నాయక్, సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షుడు బోళ్ల కొంరయ్య, నాయకులు పాల్గొన్నారు.
‘కుడా’ భూముల పరిశీలన
నయీంనగర్: పైడిపల్లి గ్రామంలోని ‘కుడా’ భూములతోపాటు నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి శనివారం పరిశీలించారు. కొత్తపేట గ్రామ దారి నుంచి పోతున్న ఇన్నర్ రింగ్‌రోడ్డు సర్కిల్ పాయింట్‌ను పరిశీలించారు. వరంగల్ బస్‌స్టేషన్ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ అనుబంధ పరీక్షల సామగ్రి పంపిణీ


