గోదారంగనాథస్వామి కల్యాణం
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం గోదారంగనాథస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గోదాదేవి, రంగనాథ స్వామి వివాహాన్ని వేదమంత్రాలతో దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి భక్తుల సమక్షంలో జరిపించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్
రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, వరంగల్: జిల్లాలో ఎన్నికలు జరగనున్న నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు బుధవారం రిజర్వేషన్లు ఖరారు అయ్యా యి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు మూడు(ఎస్టీ జనరల్ 2, ఎస్టీ మహిళ 1), ఎస్సీలకు నాలుగు (ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 2), బీసీలకు 8(బీసీ జనరల్ 4, బీసీ మహిళ 4), జనరల్ మహిళలకు 8, జనరల్‌కు 7 స్థానాలను రిజర్వ్ చేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు మూడు(ఎస్టీ జనరల్ 2, ఎస్టీ మహిళ 1), ఎస్సీలకు రెండు(ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1), బీసీలకు ఒకటి (జనరల్), జనరల్ మహిళలకు నాలుగు, జనరల్‌కు రెండు స్థానాలు ఖరారు చేశారు.
అయ్యప్పస్వామి
ఆలయంలో జ్యోతి దర్శనం
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శబరిమల జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలో ఊరేగించారు. మాలధారులు, భక్తులు, ప్రజలు దర్శనం చేసుకున్నారు. గర్భగుడిలోని స్వామి వారికి అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆలయ శిఖరంపై వెలిగించిన మకర జ్యోతుల దర్శనాన్ని ప్రజలు తిలకించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, ఆలయ అధ్యక్షుడు సైఫా సురేశ్, కార్యదర్శి చింతల కమలాకర్‌రెడ్డి, దొడ్డ రవీందర్, మాదారపు చంద్రశేఖర్, శ్రీరాం ఈశ్వరయ్య, శ్రీరాముల శంకరయ్య, బండారుపల్లి చెంచారావు పాల్గొన్నారు.
మహిళ అదృశ్యం
నర్సంపేట రూరల్: వివాహిత అదృశ్యమైన సంఘటన నర్సంపేట పట్టణంలోని ఇందిరానగర్‌లో జరిగింది. ఎస్సై గూడ అరుణ్ కథనం ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన అయూబ్ కుమార్తె ఆసీఫానస్రీంకు గూడూరు మండలానికి చెందిన జైయాద్రేతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండున్నర సంవత్సరాల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. దీంతో ఆసీఫానస్రీం తల్లిదండ్రులతో ఉంటున్నది. బుధవారం ఉదయం తండ్రితో గొడవపడి ఇంట్లో ఎవరికి చెప్పకుండానే వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు.. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. అయూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


