లింగగిరిలో లక్ష్మీచెన్నకేశవస్వామికి పూజలు
నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలో గుట్టపై శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. జాతరలో భాగంగా బుధవారం కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్ సప్పిడి ప్రియాంక–నరేశ్ దంపతులు, ఆలయ కమిటీ బాధ్యులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి లక్ష్మీ చెన్నకేశవస్వామి వారికి సమర్పించారు. అనంతరం లక్ష్మీ చెన్నకేశవస్వామి, భూదేవి, శ్రీదేవి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో గోదారంగనాథస్వామి వారి కల్యాణోత్సవాన్ని ప్రధాన అర్చకుడు శ్రీరామన్ రామాచార్యులు, వేద పండితులు భరద్వాజ్ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మెడబోయిన రజిత కుమార్, మాజీ ఎంపీటీసీ పరకాల లక్ష్మీ రాజన్న, మాజీ సర్పంచ్‌లు మాదారపు భాస్కర్, బొమ్మనపల్లి గణేశ్, చీకటి వెంకటేశ్వర్లు, బూర్గు సూరయ్య, మాదారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.


