గంగదేవిపల్లిని సందర్శించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
గీసుకొండ: మండలంలోని జాతీయ ఉత్తమ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎన్.శృతి హర్షిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్ కుసం స్వరూప, ఉప సర్పంచ్ మేడిద ప్రశాంత్, వార్డు మెంబర్లు ఏర్పాటు చేసుకున్న సాధారణ గ్రామసభలో పాల్గొని గ్రామసభ ఉద్దేశాన్ని, జరిగేటువంటి విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వివేకానంద జయంతిని పురస్కరించుకొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ వారం రోజుల ట్రైనింగ్‌లో భాగంగా గంగదేవిపల్లి గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలను నేర్చుకోవడానికి వచ్చినట్లు వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు ట్రైనీ ఐఏఎస్ శృతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కడగండ్ల కన్యాకుమారి, ఏపిఎం.ఈశ్వర్, సీసీ బొజ్జ సురేశ్, వెటర్నరీ డాక్టర్ చిరంజీవి, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, పీఆర్‌ఏ నిమ్మల శేఖర్, డీటీఎం కుసం రాజమౌళి, మంచినీటి కమిటీ అధ్యక్షుడు రాము, వీఓఏ జనార్దన్, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


