సమ్మక్క–సారలమ్మ జాతర చరిత్ర పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన సిద్ధోజు శ్రీనివాసాచారి రాసిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర చరిత్ర పుస్తకాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ మేరకు మంగళవారం రాంనగర్‌లో మంత్రి సురేఖ పుస్తకావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ఆరుట్ల వెంకట రామకృష్ణమాచార్యులు, కామధేను వేదవిద్యాపీఠం ట్రస్టు చైర్మన్ చిలుకూరి నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
29న పద్యనాటక ప్రదర్శన
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, సంగీత నాటక అకాడమీ సౌజన్యం, వరంగల్ తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాటక సమాజాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం తెలిపారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ రాంనగర్‌లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఓడపల్లి చక్రపాణి, గూడూరు బాలాజీ, కార్పొరేటర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ) ఎక్స్ సైన్స్ కోర్సుల ఫస్ట్, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, 31 తేదీల్లో ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పరీక్షలు యూనివర్సిటీ విద్యా కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని వారు తెలిపారు. వివరాలకు కేయూ దూరవిద్య వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
విద్యారణ్యపురి: డీఈఐఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మొదటి సంవత్సరం పరీక్షలు గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించారు. విద్యార్థుల మెమోలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖాధికారులు కోరారు. రీకౌంటింగ్‌కు ఈనెల 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ మంగళవారం రాత్రి కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా పనిచేస్తున్న రాజుకు కాజీపేట తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కాజీపేట తహసీల్దార్ భావుసింగ్‌ను పరకాల డీఏఓగా బదిలీ చేశారు. ఉత్తర్వులు అందగానే వెంటనే ఇద్దరు కొత్తస్థానాల్లో బాధ్యతలు కూడా స్వీకరించారు.
దామెర: రోడ్డు భద్రతా నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ–అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అతివేగంతో వాహనం నడిపి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి, సురక్షితంగా గమ్యస్ధానాలు చేరుకోవాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పెండిగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. సదస్సులో పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, శాయంపేట సీఐ రంజిత్‌రావు, దామెర ఎస్సై కొంక అశోక్, సర్పంచ్‌లు గరిగె కల్పనకృష్ణమూర్తి, పంచగిరి రాజు, చందు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సమ్మక్క–సారలమ్మ జాతర చరిత్ర పుస్తకావిష్కరణ


