కొత్తకొండ ఆలయ అభివృద్ధికి కృషి
కేంద్ర మంత్రి బండి సంజయ్
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి మంగళవారం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి గుమ్మడికాయ, కోరమీసాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సంవత్సరం వీరభద్రస్వామిని దర్శించుకోవడం, బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతీఒక్కరు మోదీకి అండగా ఉండాలని కోరారు. అలాగే, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణారావు దేవాలయాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆలయ ఈఓ కిషన్‌రావు, సర్పంచ్ సిద్ధమల్ల రమారమేశ్, అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, కంచెర్ల రాజయ్య, సందీప్, జిల్లా నాయకులు పైడిపల్లి పృథ్వీరాజ్, రామోజ్ శ్రీనివాస్, దొంగల కొమురయ్య, తీగల రాజు, కుడితాటి చిరంజీవి పాల్గొన్నారు.


