జానపదుల జాతర షురూ
తొలిరోజు దేవతలకు ఆహ్వానం
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ప్రాతఃకాలంలో ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలికారు. స్వామివారికి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, ఈఓ, ఆలయ చైర్మన్, కమిటీ ధ్వజానికి ఏర్పాటు చేసిన కాషాయ పతాకాన్ని చేతబూని వేదమంత్రాలతో ఆలయం చుట్టూ మంగళవాయిద్యాలతో మూడు ప్రదక్షిణలు చేశారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతర సజావుగా జరగాలని మల్లన్న పరివార దేవుళ్లకు ఆవాహన చేశారు. ఆ కాషాయ పతాకాన్ని ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయంపై, స్వామి ఆలయంపైన ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. తర్వాత మహాన్యాస రుద్రాభిషేకం చేసి నీరాజన మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉపప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్‌శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్‌జోషి, అర్చకులు భానుప్రసాద్, నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్, నరేశ్, దేవేందర్, ధర్మకర్తల మండలి సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
బోనాలు, పట్నాలతో భక్తుల మొక్కులు
భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శివసత్తుల విన్యాసాలు, నృత్యాలతో బోనం నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఎల్లమ్మకు సమర్పించారు. కొందరు భక్తులు వరం పట్టగా, మరికొందరు టెంకాయ బంధనం, ముడుపులు కట్టారు.
నేడు భోగి ఉత్సవాలు
బుధవారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మంత్ర పుష్పం, దర్శనాలు ఉంటాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు.
ప్రారంభమైన ఐనవోలు మల్లన్న ఉత్సవాలు
జానపదుల జాతర షురూ
జానపదుల జాతర షురూ
జానపదుల జాతర షురూ


