మెరుగైన వైద్యం అందించాలి
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
కమలాపూర్: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని అంబాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయుష్మాన్ మందిరంలోని రికార్డులు, అక్కడ జరుగుతున్న విద్యుద్ధీకరణ పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయుష్మాన్ మందిరంలో కరెంట్ లేక పోవడంతో సేవల నిమిత్తం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, చిన్నారులు, వృద్ధులతో పాటు వ్యాక్సిన్లు నిల్వ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది, ప్రజల ద్వారా తెలుసుకుని ఆ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ అనుమతితో విద్యుత్ సరఫరా నిమిత్తం తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య మందిరం చుట్టూ ప్రహరీ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య సిబ్బంది డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి నాగరాజు, డాక్టర్ మానస, డెమో అశోక్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


