స్వామినాఽథన్ సిఫారసులు అమలు చేయాలి
సంగెం: కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కాపులకనిపర్తిలో తెలంగాణ రైతు సంఘం గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, ట్రాక్టర్, కూలీల ఖర్చులు, రైతుల శ్రమ, పెట్టుబడిని సరిగా అంచనా వేడయం లేదని విమర్శించారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంటల బీమా చేయించాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఓదెల రాజయ్య, ఊరటి అంశాలురెడ్డి, మోకిడి పేరయ్య, పి.పైడి, కర్ర రాజిరెడ్డి, రాజగోపాల్, బషీర్, మల్లేశం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


