సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి
గీసుకొండ: రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.మాధవి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. గురువారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లాస్థాయి పదాధికారుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. అన్ని వర్గాల సమస్యలపై పోరాటం కోసం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కోరారు. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, 11న మహాత్మా జ్యోతిరావుపూలే, 14న భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్వచ్ఛతా కార్యక్రమాలు, మండల, డివిజన్‌స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీశ్, రత్నం సతీశ్, వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామచందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, పోలెపాక మార్టిన్‌లూథర్, బైరి నాగరాజు, భరత్‌వీర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.మాధవి


