దివ్యాంగులకు దిగులులేని మరింత దివ్యమైన ‘ఆసరా’

- - Sakshi

నెక్కొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్‌ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా రూ. వెయ్యి పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలోని 15,585 మందికి లబ్ధి చేకూరనుంది.

అంతేకాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్లతోపాటు ఉపకరణాలు, వాహనాలు, ఇతర పథకాలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్‌ రోగులు మొత్తం 1,27,089 మంది ప్రతి నెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు.

13 మండలాలు.. 15,585 మంది లబ్ధిదారులు

సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 13 మండలాల పరిధిలోని మొత్తం 15,585 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెలా రూ.47 కోట్లను ఆసరా పింఛన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజా పెంపుతో అదనంగా రూ.1.55 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా దివ్యాంగులు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో పింఛన్‌ పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర్వులు రాగానే పంపిణీ..

జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 15,585 మంది దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 3,016 చొప్పున పింఛన్‌ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా రూ.1000 కలిపి రూ.4,016 పింఛన్‌ అందనుంది. ఉత్తర్వులు రాగానే పంపిణీ చేస్తాం.

పోరాడి సాధించుకున్నాం..

సంఘటితంగా దివ్యాంగులు చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం పింఛన్‌ను పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పింఛన్‌ పెంచాలని సంఘం తరఫున ఉద్యమించాం. దాని ఫలితంగా రాష్ట్రంలో రూ.4,016 అందుకోనుండడం సంతోషంగా ఉంది.

జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ధ్రువపత్రాలు జారీ చేసి పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పడం హర్షణీయం.  –కృష్ణమూర్తి, వీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు, నెక్కొండ

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top