దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

వనపర్తిటౌన్‌: బీసీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం ప్రకటించిందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మధు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల బీసీ యువత సెప్టెంబర్‌ 15వ తేదీలోపు https://tgobmmsnew .cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అర్హులన్నారు. ఒక రేషన్‌ కార్డులో ఒక్కరికే అవకాశం ఉంటుందని.. దరఖాస్తునకు ఆధార్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఓటర్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, లబ్ధిదారుడి ఫోన్‌నంబర్‌ నమోదు చేయాలని పేర్కొన్నారు.

131.279 మి.యూ. విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. గురువారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 73.297 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 57.982 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో 131.279 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు.

3 రోజుల పాటు

సదరం క్యాంప్‌

వనపర్తిటౌన్‌: అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు ప్రత్యేక సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఆర్డీఓ రామమహేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ దివ్యాంగులకు శుక్రవారం ఉదయం 9 నుంచి ప్రత్యేక సదరం క్యాంపు కొనసాగుతుందని, 22న ఆప్తమాలజీ, 24న హియరింగ్‌ సంబంధిత దివ్యాంగులకు క్యాంపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఆయా తేదీల్లో నిర్వహించే శిభిరాలకు హాజరుకావాలని సూచించారు.

2 ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు

ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని రెండు ఎరువుల దుకాణాల లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తూ వనపర్తి డివిజన్‌ సహాయక వ్యవసాయ సంచాలకుడు ప్రభాకర్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని స్రవంతి ఫర్టిలైజర్స్‌, పవన్‌ ట్రేడర్స్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని కొందరు రైతులు ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. స్పందించిన మండల వ్యవసాయ అధికారి ఆయా దుకాణాల్లో రైతుల సమక్షంలో విచారణ చేసి నివేదికను జిల్లా అధికారులకు అందజేశారు. అధిక ధరలు వసూలు చేయడం నేరమని గుర్తించిన ఏడీఏ ప్రభాకర్‌ రెండు దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆయా దుకాణాల్లో ఎలాంటి ఎరువుల విక్రయాలు జరపరాదని ఆదేశించారు. రైతుల ఫిర్యాదుతో జప్తు చేసిన ఎరువులకు సంబంధించి కోర్టులో 6ఏ కేసు నమోదు చేశామని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇదేవిధంగా ఉంటుందన్నారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి : సీపీఎం

వనపర్తి రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సీపీఎం నాయకులు 8 డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభికి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్‌ మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని మోదీ ఆ హామీని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. వివాదాస్పదమైన జీఓలను తొలగించి ఉద్యోగ నియమకాలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement