వనపర్తిటౌన్: జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైనట్లు కనిపిస్తోంది. జెడ్పీ సీఈఓ యాదయ్య ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన రెండునెలల్లోనే పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ డీఈఓగా పనిచేసే అబ్దుల్ ఘనీని విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ ఏడాది జూన్ 2న బదిలీ చేయడంతో పాటు ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్‌రెడ్డిని జిల్లా విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారణాలు ఏమిటో తెలియదుగాని ఆయన బాధ్యతలు స్వీకరించకపోవడంతో పాఠశాలల పునః ప్రారంభ సమయంలో విద్యావ్యవస్థ గాడితప్పే అవకాశం ఉందని కలెక్టర్ జెడ్పీ సీఈఓ యాదయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమయపాలన పాటించని ఏడీపై కఠినంగా వ్యవహరించారు. మాన్యువల్, బయోమెట్రిక్ హాజరులో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి ఆమె వేతనంలో కోత విధించారు. ఏడీ హాజరుపై చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. రెగ్యులర్ డీఈఓలు సైతం చర్యలకు వెనుకడుగు వేశారు. ఈ విషయంపై ఇన్‌చార్జ్ విద్యాధికారి ప్రత్యేక నిఘా ఉంచి మాన్యువల్, బయోమెట్రిక్ హాజరు నమోదులో తేడాలను గుర్తించి 10 రోజులకుపైగా వేతనాన్ని నిలిపివేయడం కార్యాలయంలో చర్చకు దారితీసింది.
సెక్టోరియల్ అధికారులు ఇతర విభాగాల నిర్వహణ బాధ్యతలతో అవసరమైనప్పుడు మాత్రమే జిల్లా విద్యాధికారి కార్యాలయానికి వచ్చి పని ముగిసిన తర్వాత తిరిగి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. కాని కొందరు అలాగాకుండా అదనపు బాధ్యతల పేరుతో ఇష్టానుసారంగా పాఠశాాలలకు డుమ్మాకొట్టి డీఈఓ కార్యాలయానికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గత మంగళవారం సెక్టోరియల్ అధికారులతో ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని.. లేకుంటే శాఖాపరమైన చర్య లు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. అలాగే కొందరు అదనపు బాధ్యుల ఉపాధ్యాయులు ఆయా విభాగాలకు అవసరమైనప్పుడు మాత్రమే డీఈఓ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అసలు విధులకు ఎసురు పెడుతున్నారు.
చర్యలకు ఉపక్రమించిన ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి
ఏడీ హాజరులో వ్యత్యాసాలు.. వేతనంలో కోత
సెక్టోరియల్ అధికారులపైనా ప్రత్యేక నిఘా
బడి మరిచిన అదనపు బాధ్యులపై చర్యలు తీసుకునేనా?


