వనపర్తి రూరల్: వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు లారీల కొరత లేకుండా చూడాలని గురువారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డు ఎదుట రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించినా ధాన్యం సేకరణ జరగడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రమేష్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ అక్కడికి చేరుకొని ఎలాంటి ఆందోళన చెందవద్దని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. పోలీసులు రహదారిపై ఉన్న ద్విచక్ర వాహనాలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
గోపాల్‌పేట: కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలరోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బుద్దారం రైతులు గురువారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ శేఖర్ రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కేంద్రానికి తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోళ్లకు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ధాన్యంలో తాలు, గడ్డి, రాళ్లు ఉన్నాయని అధికారులు కారణాలు చెప్పడం విచారకరమన్నారు. కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో లేవని.. కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ జగన్‌మోహన్ అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. శుక్రవారం నుంచి కొనుగోళ్లు సక్రమంగా జరిపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధికారి రామ్మోహన్‌రావు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.


