ధాన్యం సేకరణలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో వేగం పెంచాలి

May 14 2026 12:13 AM | Updated on May 14 2026 12:13 AM

వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగాలని.. మిల్లుల వద్ద లారీలు ఎక్కువ సమయం వేచి ఉండటానికి వీలులేదని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి వరి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడమే ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని.. రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మిల్లు వద్ద ఓ ప్రత్యేక అధికారి ఉండి ధాన్యం లారీలను త్వరగా ఖాళీ చేయించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పలు మండలాల్లో మిల్లుల వద్ద లారీలు ఎక్కువ మొత్తంలో వేచి ఉన్నట్లు సమాచారం అందుతుందని.. త్వరగా అన్‌లోడ్‌ చేయించాలని ఆదేశించారు. మిల్లర్లు తరుగు పేరిట కోతలు విధించడానికి ఆస్కారం లేకుండా చూడాలని.. ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోళ్లు వేగంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అవసరమైన లారీలను అందుబాటులో ఉంచమని ధాన్యం రవాణా కాంట్రాక్టర్లకు సూచించాలని, లారీల కొరత కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లుల వద్ద అదనంగా హమాలీలను ఏర్పాటుచేసి లారీల్లోని ధాన్యం త్వరగా ఖాళీ చేసేలా చొరవ చూపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, డీసీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్‌, డీఆర్డీఓ పీడీ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస, తహసీల్దార్లు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

జనగణనపై విస్తృత ప్రచారం..

జనగణన–2027పై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జనగణన–2027 ప్రచార వాహనాన్ని అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తో కలిసి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనం ప్రతి గ్రామం, పట్టణంలో తిరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు జనగణన ప్రక్రియలో చురుగ్గా పాల్గొని కచ్చితమైన సమాచారం అందించాలని, సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. డీఆర్డీఓ ఉమాదేవి, ఏవో భానుప్రకాష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement
 
Advertisement
Advertisement