ఆత్మకూర్: జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక నాయకులతో వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని, వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల–ఆత్మకూర్ మధ్య రాకపోకలకు సమయంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. వర్షాకాలంలోగా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి వయా ఆత్మకూర్, గద్వాల, రాయచూరు మీదుగా మంత్రాలయం వెళ్లే వారికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, పుర చైర్‌పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, జిల్లా కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు ఉన్నారు.
ఆధ్యాత్మిక చింతన అవసరం..
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో పునః నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశానని, ఆ తల్లి దయతో మంత్రిగా ఎన్నికై ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలో సంస్థానాధీశుల కాలం నుంచి గ్రామదేవతలను పూజించేవారని శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మించుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మొగిలి శ్రీధర్‌గౌడ్, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి


