రహదారులపై ధాన్యం ఆరబోత
● జిల్లాలో తరుచూ
చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
● రెండేళ్లలో నలుగురు మృత్యువాత.. మరో పదిమందికి గాయాలు
● అవగాహన కార్యక్రమాలు కరువు
● పట్టించుకోని అధికారులు
●
వనపర్తి: రోడ్లపై పంటనూర్పిళ్లు, ధాన్యం ఆరబోయడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు స్పందించడం లేదు. విలువైన ప్రాణాలు కోల్పోతున్నా.. నిర్లక్ష్యం వీడకపోవడం శోచనీయం. రోడ్లపై ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు వెళ్తే జరిమానా విధిస్తున్న అధికారులు.. ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నారు. తాజాగా ఏదుల రిజర్వాయర్ సమీపంలో రోడ్డుపై మొక్కజొన్న ఆరబెట్టి చుట్టూ ఉంచిన రాళ్లకు బైకు ఢీకొని 24 ఏళ్ల వీరపాగ కృష్ణ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై కూడా పంట ఉత్పత్తులను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేయడం ఆగడం లేదు. జాతీయ ఉపాధిహామీ పథకం నిధులతో రైతులు పొలాల్లోనే పంట నూర్పిళ్లు, ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినా.. నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో రోడ్లపై పంటలను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేయడం పరిపాటిగా మారింది. రోడ్లపై ధాన్యం కుప్పలు, ఆరబోసిన ధాన్యం చుట్టూ ఏర్పాటుచేసిన రాళ్లతో రాత్రిళ్లు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో ద్విచక్ర వాహనదారులు నలుగురు మృతిచెందిగా.. మరో పదిమందికిపైగా గాయాల పాలైనట్లు అధికారిక సమాచారం. ఇక ప్రమాదానికి గురైనా పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వని ఘటనలు పదుల సంఖ్యలో ఉంటాయి. ఈ ఘటనలపై ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, పోలీసుశాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
జిల్లాలో ఏటా వరి సాగు పెరుగుతూనే ఉంది. దీంతో జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచారు. కేంద్రాల వద్దనే పంటలను ఆరబెట్టేందుకు సౌకర్యాలు కల్పిస్తే రైతులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది.


