వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తరలించేందుకు పక్కా ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహచర మంత్రులు, ప్రధానకార్యదర్శితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. రోజు 10 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. రవాణా కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెక్టార్ వారీగా సొంత వాహనాలతో పాటు వారు చెప్పిన అద్దె వాహనాల్లో ధాన్యం తరలింపునకు కేటాయించాల్సిందేనన్నారు. ఒకవేళ ఒప్పందం ప్రకారం లారీలు సమకూర్చకుంటే చీటింగ్ కేసు నమోదు చేయాలని, గత సీజన్‌తో పాటు ఈ సీజన్ డబ్బులు సైతం ఇవ్వకుండా నిలిపివేయాలని ఆదేశించారు. రవాణా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాహనాల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న లారీ అసోసియేషన్‌లతో మాట్లాడి అన్ని లారీలు, డీసీఎంలు ధాన్యం తరలించేందుకు వినియోగించుకోవాలని రవాణా అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములను ధాన్యం నిల్వలకు తీసుకోవాలని, గోదాములను గుర్తించి జాబితా ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. రోజు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు, గోదాముల్లో దించుకోవాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఒప్పందం కుదుర్చుకున్న 53 మిల్లులకు రోజు ధాన్యం తరలించి వెంటనే దించుకునేలా చూడాలన్నారు. అన్ని మిల్లుల వద్ద సిబ్బందిని ఉంచి రోజువారీగా ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి నివేదిక అందించాలని కోరారు. హమాలీల సమస్య తలెత్తకుండా చూడాలని లేబర్ కమిషనర్‌ను ఆదేశించారు. కేంద్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం.. రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో నివేదిక అందజేయాలన్నారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు రోజువారీ వివరాలను మీడియాకు ఇవ్వాల్సిందిగా సూచించారు. రానున్న 15 రోజులు రెవెన్యూ అదనపు కలెక్టర్‌తో పాటు పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, డీఆర్డీఓ, డీసీఓ, రవాణా తదితర శాఖలు ధాన్యం కొనుగోలుపైనే దృష్టి సారించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, డీటీఓ మానస, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


