రైతులను నష్టపర్చే
చర్యలను ఉపేక్షించం..
మిల్లర్లు కోత విధిస్తే ఉపేక్షించం
● కేంద్రాల్లోనే నాణ్యతను పునః పరిశీలించాలి
● రవాణాకు నిర్దేశిత వాహనాలే
వినియోగించాలి
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు
మిల్లర్లు ప్రత్యేకించి ఈ సీజన్‌లో చిన్నపాటి యంత్రాలను తీసుకొచ్చి నూక, బియ్యం శాతం తక్కువగా వస్తుందంటూ రైతుల ధాన్యంలో కోతలు విధించే ప్రయత్నం చేస్తున్నారని.. వాటి ఫలితాలు అశాసీ్త్రయమైనవని, పరిగణలోకి తీసుకునేది లేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. రవాణా ఏజెన్సీలు అగ్రిమెంట్ సమయంలో ఇచ్చిన లారీలకు బదులు ఇతర లారీలతో ధాన్యం తరలిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులకు గురిచేస్తే బిల్లుల చెల్లింపుల సమయంలో అవస్థలు తప్పవని రవాణా ఏజెన్సీలను హెచ్చరించారు. జిల్లాకు సుమారు 70 లక్షల గన్నీబ్యాగులు అవసరమైతే ప్రస్తుతం 55 లక్షల గన్నీబ్యాగులు ఉన్నాయని, మిగతా వాటి కోసం ఇండెంట్ పంపిస్తామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాంలకు సొంత వాహనాల్లో ధాన్యం తరలిస్తే రవాణా డబ్బులను చెల్లించనున్నట్లు చెప్పారు.
వనపర్తి: అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మధ్య సమన్వయ లోపంతోనే వరి ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని కళ్యాణసాయి గార్డెన్స్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఆయనతో పాటు వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికొస్తే ఇప్పటి వరకు 40 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొన్న ధాన్యం సకాలంలో మిల్లులు, గోదాంలకు తరలించకపోవడం, మిల్లుల వద్ద ధాన్యం బస్తాలతో లారీలు నిలిచిపోవడం వంటి సమస్యలు నిత్యం తమ దృష్టికి వస్తున్నాయని, రైతులు మిల్లులు, గోదాం వద్దకు వెళ్లి పైరవీలు చేస్తే తప్ప ధాన్యం దించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు మిల్లర్లు, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను బతిమిలాడాలా అంటూ పౌరసరఫరాలశాఖ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రైతులు విక్రయించిన ధాన్యంలో కోతలు విధిస్తూ ఇబ్బందుల పాలు చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎం, డీఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుజేసే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. సదరు ఔట్‌సోర్సింగ్ టీఏను స్టేజీపైకి పిలిపించి రైతులను ఇబ్బందులు పెట్టమని ఎవరు చెప్పారని నిలదీశారు. ప్రభుత్వ గోదాంల వద్ద టీఏలు, మిల్లుల వద్ద మిల్లర్లు తూకాల్లో కోతలు విధించి రైతులకు అన్యాయం చేయాలని చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి నిబంధనల ప్రకారం బియ్యం అప్పగించాలని.. అందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన ధాన్యం బస్తాలో నింపి నిర్దేశిత మిల్లులు, గోదాంలకు తరలించేలా డీఆర్డీఓ, డీసీఓ, మెప్మా, సివిల్ సప్లయ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ నిత్యం పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.
సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ సాగాలి..
జిల్లావ్యాప్తంగా ఎక్కడా వరిధాన్యం కొనుగోలు సమస్య అనే ఫోన్ రానివ్వకుండా అధికారులు, మిల్లర్లు, లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరారు. మిల్లర్లు రైతుల ధాన్యంలో కోత విధించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయరాదన్నారు. గోదాంల వద్ద టీఏలను సైతం పౌరసరఫరాలశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, డీఆర్డీఓ ఉమాదేవి, మార్కెటింగ్ శాఖ డీఎం స్వరణ్‌సింగ్, డీఎం, డీఎస్‌ఓ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సుమారు 280 మిల్లులుంటే.. కేవలం 53 మిల్లులకే యాసంగి ధాన్యం కేటాయింపులు చేశారు. అధికారులు కొందరికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. మిగతా వారితో ఎందుకు రికవరీ చేయడం లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. ధాన్యం నాణ్యత లోపాలతో మిల్లర్లు నష్టపోతున్నారని జిల్లా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి బదులివ్వగా, అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. మిల్లర్లు నష్టపోతే వందలోపు ఉన్న మిల్లులు మూడువందలకు చేరవుగా ఎందుకు పెరుగుతాయని.. రైతులను నష్టపరిచే చర్యలను తాము ఎప్పటికీ ఉపేక్షించబోమన్నారు. సంచిలో ఆరు కిలోల తాలు వస్తుందని ఆయన మరో ఆరోపణ చేస్తే సంచిలో అంత తాలుంటే ధాన్యం నింపే అవకాశం ఉండదన్నారు. రైతులు ధాన్యం దించేందుకు మిల్లులు, గోదాంల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని, కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారి తూకం చేస్తే సమస్య ఉత్పన్నం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు సక్రమంగా పర్యవేక్షిస్తే సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. రైతుల పక్షాన ఎమ్మెల్యే మిల్లర్లు, అధికారులు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, టీఏలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో సమీక్షకు హాజరైన రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.


