తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

వనపర్తి: మిల్లుల వద్ద లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా ధాన్యం దించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌, జనగణన ప్రక్రియ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో యాసంగి సీజన్‌ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి తరలిన ధాన్యం కేటాయించిన మిల్లుకు చేరిన తర్వాత అక్కడ తరుగు, ఇతర కారణాల పేరిట రైతులను మోసం చేయడానికి వీలులేదని.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దించుకోకుండా అనేక కారణాలు చూపి లారీలను నిలబెట్టుకుంటే చర్యలు తప్పమన్నారు. తహసీల్దార్లు పర్యవేక్షణ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రవాణా కాంట్రాక్టర్లు కూడా సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలని, ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు.

క్షేత్రస్థాయి హద్దులను తనిఖీ చేసుకోవాలి..

జనగణన–2027లో భాగంగా సోమవారం నుంచి క్షేత్రస్థాయి హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియ నిర్వహించడానికి వెళ్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు గుర్తింపు కార్డులు, జనగణన సామగ్రి తప్పనిసరిగా అందజేయాలని చార్జ్‌ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఎన్యూమరేటర్లు మొదటి మూడురోజులు తమకు కేటాయించిన హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల హద్దుల్ని తనిఖీ చేసుకునేలా చూడాలని సూచించారు. హెచ్‌ఎల్‌బీల హద్దుల్ని మూడురోజులు తనిఖీ చేసుకొని హౌస్‌లిస్టింగ్‌ ఆపరేషన్స్‌కు సిద్ధం కావాలన్నారు. ఈసారి డిజిటల్‌ పద్ధతిలో జనగణన చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని, ఎవరు కూడా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు. ఓఆర్‌ఎస్‌ కిట్‌ అందుబాటులో ఉంచాలని ఛార్జ్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, సీపీఓ హరికృష్ణ, డీఆర్డీఓ ఉమాదేవి, వీసీ ద్వారా తహసీల్దార్లు, పోలీస్‌ అధికారులు, సెన్సస్‌ ఛార్జ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement