వనపర్తి రూరల్/గోపాల్‌పేట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కేంద్రాల్లో అన్నదాతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం వనపర్తి మండలం చిమనగుంటపల్లి, చిట్యాల వ్యవసాయ మార్కెయార్డు, గోపాల్‌పేటలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గింజ కొంటామన్న మంత్రులు, అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకున్నా, విద్యుత్ కోతలున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి, మొక్కజొన్నను కొనకుండా రైతులను హరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగంగాక తప్పదని హెచ్చరించారు. రవాణా, హమాలీలు, గన్నీబ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. యాసంగి పంటలో ఎలాంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన వరి, మొక్కజొన్న అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందని.. వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, తరుగు పేరుతో మోసం చేయొద్దని సూచించారు. ఆయన వెంట చిట్యాల సర్పంచ్ శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, మాణిక్యం, భానుప్రకాష్, రఘువర్ధన్‌రెడ్డి, రవిప్రకా ష్, చిట్యాల రాము, పరంజ్యోతి, రమేష్‌గౌడ్, నందిమళ్ల అశోక్, గోపాల్‌పేటలో సర్పంచ్ స్వప్నభాస్కర్, రైతుబంధు మాజీ అధ్యక్షుడు తిరుపతియాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


