తాగునీటి తంటాలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి తంటాలు

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

వట్టిపోతున్న సోర్సుబోర్లు.. మిషన్‌ భగీరథపైనే ఆశలు

వనపర్తిలో 4 రోజులకోసారి సరఫరా

పెబ్బేరు శివారు ప్రాంతాల్లో ట్యాంకర్లతో..

పురపాలికల్లో సరిపడా లేని ట్యాంకర్లు

వేసవిలో తప్పని నీటి కష్టాలు

అమరచింత: జిల్లాలోని పుర ప్రజలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమైనా.. సోర్సుబోర్లు వట్టిపోతుండటంతో మిషన్‌ భగీరథపైనే ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. కొన్ని పురపాలికల్లో రోజు విడిచి రోజు నీటిని వదులుతుండటంతో వచ్చి నీటిని నిల్వ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మూడు, నాలుగు రోజులకోసారి వార్డుల వారీ గా నీటిని వదులుతుండగా.. వాటినే పొదుపుగా వా డుకోంటున్నామని ప్రజలు తెలిపారు. పెబ్బేరు పురపాలికలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో తాగునీటి పైప్‌లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో పురపాలికకు చెందిన రెండు ట్యాంకర్ల ద్వార నిత్యం ఆయా కాలనీలకు సరఫరా చేస్తున్నారు. అమరచింత, ఆత్మకూర్‌, కొత్తకోట పురపాలికల్లో పూర్తిస్థాయిలో మిషన్‌ భగీరథ నీటిపైనే ఆధారపడి పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఉన్న సోర్సుబోర్లు వేసవిలో వట్టిపోయే స్థితికి చేరుకున్నాయి.

మిషన్‌ భగీరథే ఆధారం..

ప్రస్తుతం మున్సిపాలిటీల్లో నీటి సరఫరా మిషన్‌ భగీరథపైనే పూర్తిస్థాయిలో ఆధారపడింది. జలాశయాల్లో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవని పట్టణ ప్రజలు వెల్లడిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఎల్కూర్‌లోని మిషన్‌ భగీరథ సంప్‌హౌజ్‌ వద్ద మరమ్మతులు తలెత్తితే నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురవుతాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని సోర్సుబోర్లు వట్టిపోకుండా మరమ్మతులను వెంటనే చేపట్టడం, ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలతో నీటి కష్టాలను దూరం చేయవచ్చు.

నీటి కోసం ఎదురుచూపులు

వేసవికి ముందే రెండ్రోజులకు ఓసారి కొ ళాయిలకు నీటిని వదిలేవారు. ప్రస్తుతం 4 రోజులకు ఒకసారి వ దులుతున్నారు. నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – లక్ష్మి, 24వ వార్డు, వనపర్తి

పుర అధికారుల నిర్లక్ష్యం..

కాలనీవాసులు తాగునీటి కోసం రోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. కొళాయిల్లో నీరు వస్తుందని తెలిస్తే చాలు అన్ని పనులు వదిలేసి నీటిని పట్టుకొని నిల్వ చేసుకునే దుస్థితి నెలకొంది. మూడు, నాలుగు రోజులకు ఓసారి నీటిని వదులుతున్నారు. నీటిసమస్య తీవ్రంగా ఉంది. అధికారులు పట్టించుకొని పరిష్కరించాలి. – సాయిలీల, 22వ వార్డు, వనపర్తి

ముందస్తు చర్యలు..

వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. పురపాలికలోని చేతి పంపులను బాగుచేయించి మోటార్లు బిగించి నీటిని అందిస్తున్నాం. మిషన్‌ భగీరథ నీటితో పాటు సోర్సుబోర్లను వినియోగించుకుంటూ ప్రజలకు నీటి కష్టాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

– శశిధర్‌, పుర కమిషనర్‌, ఆత్మకూర్‌

ఒక్కరికి రోజుకు 125 లీటర్ల చొప్పున..

నిత్యం కొళాయిల ద్వారా ఒక్కరికి 125 లీటర్ల చొరప్పున నీటిని సరఫరా చేయాలి. ఇలా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది లెక్కన నీటిని అందించాల్సి ఉంది. వచ్చిన నీటిని తాగు, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement