జనగణనలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో భాగస్వాములు కావాలి

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా మారథాన్‌

వనపర్తి: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి విజ్ఞప్తి చేశారు. జనగణన నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మారథాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలుర జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన మారథాన్‌.. పాలిటెక్నిక్‌ కళాశాల వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్‌ విధానంలో జనగణన చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెల 11 నుంచి జూన్‌ 10 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 13వేల మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇళ్ల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. జనగణనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సీపీఓ హరికృష్ణ, డీవైఎస్‌ సుదీర్‌రెడ్డి పాల్గొన్నారు.

పెండింగ్‌ చెల్లింపులు పూర్తిచేయండి..

2022–23 యాసంగి సీజన్‌ ధాన్యానికి సంబంధించిన బకాయిల చెల్లింపులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌ కుమార్‌తో కలిసి రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–23 యాసంగి వేలం ధాన్యానికి సంబంధించి బకాయిలను క్లియర్‌ చేసేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మిల్లర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెండింగ్‌ చెల్లింపులు పూర్తిచేసిన మిల్లర్లను డిఫాల్టర్‌ జాబితా నుంచి తొలగించి.. వారికి తిరిగి ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు పొందే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్‌, డీఎం ఆంజనేయులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement