వీపనగండ్ల: తరుగు, తాలు పేరుతో రైస్‌మిల్లర్లు పెడుతున్న కొర్రీలను తట్టుకోలేని రైతులు శనివారం వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో నడిరోడ్డుపై వరిధాన్యానికి నిప్పుపెట్టి ఆందోళనకు దిగారు. రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల మహిళా సమాఖ్య ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తే.. తరుగు, తాలు, తేమ తదితర కారణాలు చూపి ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారన్నారు. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరేశ్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


