కొత్తకోట రూరల్: కొత్తకోట పట్టణ సమీపంలో గల వెంకటగిరిగుట్టపై ఆలయంలోని భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణపక్షం ఏకాదశి పురష్కరించుకొని వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున ఉత్సవమూర్తి విగ్రహాలను అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరణ చేశారు. కల్యాణానికి కొత్తకోటతో పాటు కానాయపల్లి, పాలెం, నిర్వేన్ గ్రామాల నుంచి పెద్దఎత్తున హాజరైన భక్తుల మధ్య అర్చకులు వేదమంత్రాలతో అర్చకులు తలంబ్రాలు పోయగా ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. భక్తులతో ఆలయం గోవింద నామస్మరణంతో మారుమోగింది. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరా ఆచార్యులుతో పాటు ఆలయ నిర్వాహకులు, వేముల శ్రీనివాస్‌రెడ్డి, బలిజపల్లి శ్రీనివాస్, దినేష్‌రెడ్డి, నర్సింహారావు, భీమ దత్తుశెట్టి, సంద వెంకటేష్, బలరాం, నరేష్‌కుమార్ పాల్గొన్నారు.


