● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తిటౌన్: మత్స్యకారుల అభ్యున్నతికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించి చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని నాగవరం శివారు రైతువేదికలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి చేపల ఉత్పత్తిని పెంచేందుకు సహకరిస్తామని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో మత్స్యకారులు చేపల విక్రయాలు చేసుకునేందుకు మొబైల్ వాహనాలు, రాయితీ రుణాలు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని నల్లచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కట్టపై గంగమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని చెప్పారు. ముదిరాజ్‌లకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించి సమన్నత స్థానం కల్పించారని చెప్పారు. అనంతరం గోపాల్‌పేట మండలం చాకలిపల్లికి చెందిన మహిళలకు మహిళా పారిశ్రామిక సహకార సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, పుర చైర్‌పర్సన్ మాధవి, పెబ్బేరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవానంద్, సీఎస్సీ ప్రతినిధి మాలిక్, ప్రజాప్రతినిధులు, జిల్లా మత్స్య సహకార సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సమీకృత సముదాయాన్ని
వినియోగించుకోవాలి..
సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. శుక్రవారం భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ అస్స్యూరెన్స్ కార్యాలయాన్ని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సముదాయం నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా అద్దె అధికంగా ఉండటంతో దుకాణాలు తీసుకోవడానికి వ్యాపారస్తులు ముందుకు రాలేదన్నారు. దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు పంపించి ఆయన ఆమోదంతో తగ్గించినట్లు చెప్పారు. కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్‌హాల్‌ను సైతం వినియోగంలోకి తీసుకొస్తామని, దాని చుట్టూ గోల్డ్ బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని.. త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మారుస్తామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పుర చైర్‌పర్సన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రా, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


