ఖిల్లాఘనపురం: సేంద్రియ వ్యవసాయంతో మానవ మనుగడ సాధ్యమవుతుందని.. రైతులు ఆధునిక పద్ధతిలో పంటల సాగు చేపడితే లాభసాటిగా ఉంటుందని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆగ్రానమీ విభాగం శాస్త్రవేత్తలు డా. ప్రగతి, డా. సాయిమిత్ర తెలిపారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని సోళీపురం రైతువేదికలో ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి సమావేశానికి హాజరైన వారు ఆధునిక సాగు పద్దతులు, ఖర్చు తగ్గింపు మార్గాలు, నేల ఆరోగ్యం పరిరక్షణపై రైతులకు అవగాహణ కల్పించారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని అవసరమైన ఎరువులు తగిన మోతాదులో వినియోగించాలన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడంతో సారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. పంట మార్పిడితో నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నీటి వనరులను సంరక్షించుకోవాలని.. వరికి అవసరానికి మించి యూరియాను వినియోగిస్తే నేల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఎరువుల వినియోగంలో సమతుల్యత అవసరమని, తెగుళ్ల నివారణకు రసాయనాలను సరైన సమయంలో వ్యవసాయ అధికారుల సూచనలతో వాడాలని సూచించారు. ప్రతి రైతు సేంద్రియ సాగు అలవర్చుకోవాలని.. కనీసం సొంత అవసరానికై నా ఎకరం, అర ఎకరం వరి సాగు చేసుకుని బియ్యం పట్టించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి రేవతి, మహేశ్వరి, సర్పంచ్ సింధు, ఉప సర్పంచ్ నవీన్‌రెడ్డి, ఏఈఓ సునీల్, పలు గ్రామాల పెద్దలు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.


