ప్రయత్నం.. సత్ఫలితం | - | Sakshi
Sakshi News home page

ప్రయత్నం.. సత్ఫలితం

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

కలెక్టర్‌ ఆదేశాలతో..

ప్రత్యేక తరగతులు..

‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

రాష్ట్రస్థాయిలో జిల్లా 29 స్థానం నుంచి 19వ స్థానానికి చేరిక

ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు

గణితం, ఆంగ్లం ప్రత్యేక తరగతుల

నిర్వహణతోనే..

అమరచింత: కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ప్రత్యేక చొరవతో జిల్లా విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు. గత విద్యాసంవత్సరం 10వ తరగతి ఫలితాలను పరిశీలిస్తే 89.2 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 29వ స్థానంలో నిలిచింది. దీంతో ఆయన 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. పది ఫలితాల్లో జిల్లా వెనుకబడటానికి కారణాలను ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా 680 మంది విద్యార్థులు ఫెయిల్‌ కాగా.. అందులో 415 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఉత్తీర్ణత సాధించలేదని గుర్తించారు. వెంటనే జిల్లాలోని గణిత ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇంతమంది విద్యార్థులు కేవలం గణితంలోనే ఫెయిల్‌ కావడానికి కారణం ఏమిటి? సరిగా బోధన అందడం లేదా లేక మరేదైనా కారణం ఉందా అని ఆరా తీశారు. విద్యార్థులకు కనీసం కూడికలు, తీసివేతలు, గుణింతాలు కూడా రాకపోవడం, ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలు అర్థం కాకపోవడం వంటి ప్రధాన కారణాలు తెలుసుకున్నారు. వెంటనే 8, 9, 10 తరగతి విద్యార్థులకు గణితం, ఆంగ్లంలో తేలికై న ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించి అందులో ఫెయిల్‌ అయిన విద్యార్థుల జాబితా రూపొందించారు. ఆయా పాఠ్యాంశాల్లో అధిక ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులతో ప్రత్యేక అభ్యసన సామగ్రిని తయారు చేయించారు. వాటిని అన్ని ఉన్నత పాఠశాలల్లో తొలి రెండు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు బోధించారు.

విద్యాశాఖపై కలెక్టర్‌ ప్రత్యేక నజర్‌

కలెక్టర్‌ ఆదేశాలతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి 8 ,9, 10 తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులకు గణితం, ఆంగ్లంపై ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పదోతరగతి విద్యార్థులకు నిత్యం ఉదయం, సాయంత్రం గంట పాటు విషయాల వారీగా తరగతులు కొనసాగాయి. వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాం. దీంతో ఆశించిన ఫలితాలు సాధించగలిగాం.

– అబ్దుల్‌ ఘనీ, జిల్లా విద్యాధికారి

ప్రత్యేక తరగతులతో విద్యార్థులు గణితంపై అవగాహన పెంచుకొని కాస్త పట్టు సాధించారు. దాని ఫలితంగా ఈ విద్యా సంవత్సరం పదోతరగతి వార్షిక పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే గణితంలో ఫెయిల్‌ అయ్యారు. దీంతో పది ఫలితాల్లో జిల్లా 97.46 శాతం ఉత్తీర్ణత సాధించి గతేడాది కంటే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి రాష్ట్రస్థాయిలో 19వ స్థానానికి చేరింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యాశాఖ అధికారితో పాటు ఉపాధ్యాయులను అభినందించి ఇదే ఉత్సాహంతో ముందుకుసాగాలని.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement