వనపర్తి: ఎలాంటి విపత్తులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేంద్ర విపత్తు నిర్వహణ లీడ్ కన్సల్‌టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహల్ కోరారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విపత్తులను ఎదుర్కోడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరదలు, పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదాలు, అడవుల్లో మంటలు చెలరేగడం, రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం ఎలా వ్యవహరించాలనే వివరాలు వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉండాలో సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతలపై ఈ నెల 15 వరకు టేబుల్ ఎక్సర్‌సైజ్ చేయాలని.. 18వ తేదీన మాక్‌డ్రిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతలు ఏమిటి, ఎలా నిర్వర్తించాలనే విషయాలను తెలుసుకోవడమేగాకుండా ప్రాక్టికల్‌గా చేస్తేనే ప్రమాదాలు వచ్చినప్పుడు ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను వరద ప్రమాద జిల్లాలుగా, 5 జిల్లాలను పరిశ్రమల ప్రమాద జిల్లాలుగా, అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలను అగ్ని ప్రమాద జిల్లాలుగా గుర్తించినట్లు తెలిపారు. వీసీలో హైదరాబాద్ నుంచి ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెనన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్‌మాన్, కార్యదర్శి హరిచందన దాసరి, జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓ హరికృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి బి.ధర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


