ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం : బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం : బీఆర్‌ఎస్‌

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

వనపర్తి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి, మొక్కజొన్నను నెలరోజులుగా కొనుగోలు చేయడం లేదని, సేకరణలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌ ఆరోపించారు. గురువారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డును వారు సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 287 మాత్రమే ప్రారంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి 3.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని.. పండించిన వరి, మొక్కజొన్నను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షులు రఘువర్ధన్‌రెడ్డి, వెంకటసాగర్‌, డేగ మహేశ్వర్‌రెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, సర్పంచ్‌ శోభా కృష్ణ, ఉప సర్పంచ్‌ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement