బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

ఆత్మకూర్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య కార్మికులకు పదినెలల బకాయి వేతనాలు, కటింగ్‌ ఏరియర్స్‌ వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్రకార్యదర్శి సురేష్‌ కోరారు. గురువారం స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపి వైద్యాధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యం పెంచాలని దశల వారీగా పోరాటాలు చేయడం, మంత్రి వాకిటి శ్రీహరి కృషితో పడకల సామర్థ్యం పెంచడంతో పాటు 10 నెలల ఏరియర్స్‌ విడుదల చేశారని గుర్తుచేశారు. బడ్జెట్‌ విడుదలై రెండునెలలు గడుస్తున్నా చెల్లించకుండా కాంట్రాక్టర్‌, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మూడునెలల వేతనాలు పెండింగ్‌లో ఉంచడం దారుణమన్నారు. కార్మికులు ఏళ్ల తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ వేతనాల్లో కోత విధిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు ఏరియర్స్‌తో పాటు జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషా, నాయకులు సత్తార్‌, బాలరాజు, శ్రీకాంత్‌, అరుణ్‌, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్‌, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement